శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిబ్రవరి 3న ‘క్వాంటం’ కార్యకలాపాలు

4 గంటల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సైబరాబాద్‌ ‌ప్లస్‌‌గా అమరావతి

- ఐఐటియన్ల మేధస్సుతో రాష్ర్టాభివృద్ధి

- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్‌ ‌కంప్యూటర్‌ కార్యకలాపాలు (ఆపరేషన్స్‌) అమరావతిలోనే ప్రారంభమౌతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదిన దానిని ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటి-2026 ఆంధ్రప్రదేశ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలను, స్టార్టప్‌‌లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఐబిఎం–టిసిఎస్‌, ఎల్‌అండ్‌టి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్‌ ఆరోజు నుంచి అమరావతిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్వాంటమ్‌ ‌కంప్యూటర్‌ అవిష్కరణతో సైబరాబాద్‌ ‌ప్లస్‌‌గా అమరావతి మారుతుందని, దేశంలోని ప్రతి ప్రాంతానికి క్వాంటమ్‌ ‌కంప్యూటర్‌‌ను ఇక్కడ నుండే అందిస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఐఐటియన్ల మేధస్సు ఉపయోగపడాలన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధి కోసం ఐఐటియన్లు అనుసంధానమై నెట్‌‌వర్క్‌‌గా ఏర్పడాలని చెప్పారు. అమరావతి కేంద్రంగా రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్, డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని అన్నారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు, డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్ ఐఐటి అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మేడిన్ అమరావతి బ్రాండ్ సృష్టించేలా క్వాంటం కంప్యూటర్ల తయారీకి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో డీప్‌టెక్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించి ఇప్పటికే టెస్ట్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. వచ్చే రెండేళ్లలో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తికి అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాలు, పరిశోధన, తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఐఐటీ స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ఆరో తరగతి నుంచే విద్యార్థుల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనికి ఐఐటిలు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రిలయన్స్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. దేశంలో కోటి మంది ఎఐ నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రం నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. 5 లక్షల మంది ఐఐటియన్ల ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి వేరే స్థాయిలో ఉంటుందని సదస్సు అనంతరం మీడియాతో చంద్రబాబు చెప్పారు. సమ్మిట్‌లో జరిగిన సుదీర్ఘ మేథోమధనం అనంతరం పాన్ ఐఐటి ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా డిక్లరేషన్ విడుదల చేశాయి. అమరావతిలో ఏర్పాటు చేసే పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలను అనుసంధానం చేసే వేదికగా పని చేయనుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్