సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అలసత్వం వద్దు!

2 గంటల క్రితం

అలసత్వం వద్దు!
-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-ఉన్నతాధికారులతో  సమావేశంలో ఎస్‌ఇసి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- ఉన్నతాధికారులతో సమావేశంలో ఎస్‌ఇసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి అలసత్వానికి తావు ఇవ్వవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా శాంతిభద్రతల ఎడిజి ఎన్ మధుసూదన రెడ్డి, ఐజి బి రాజకుమారితో సోమవారం ఆయన సమావేశమయ్యారు. శాంతిభద్రతల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఉండాలన్నారు.

అదనపు బలగాలు మోహరిస్తున్నాం : డిజిపి

డిజిపి హరీష్‌‌కుమార్‌ ‌గుప్తా మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని, తదుపరి దశల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సున్నిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పునఃసమీక్షించి, అవసరమైన చోట అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు.

ఆదేశాలు జారీ చేశాం : సిఎస్‌

శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించకుండా, పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా జిల్లా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పారు.

ముందస్తు చర్యలు చేపట్టండి : జిల్లా అధికారులకు ఆదేశాలు

ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ ‌చంద్ర పునేఠా ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌‌పిలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున, ఐజి బి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని పునేఠా సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు ఉన్న సందేహాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున నివృత్తి చేశారు. శాంతిభద్రతల అంశంపై ఐజి బి రాజకుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతిభద్రతల ఎడిజి ఎన్ మధుసూదన రెడ్డి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు సంపత్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్