• ముగిసిన నామినేషన్ల స్వీకరణ
• గుత్తిలో ఎస్ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్న వైసిపి అభ్యర్థి
• తిరుపతిలో సిపిఎం అభ్యర్థి పత్రాలు చించిన కూటమి నేతలు
• సారీ చెప్పి నామినేషన్కు ఆహ్వానం
• రాయచోటి, దర్శిలో వైసిపి క్లీన్ ఔట్
ప్రజాశక్తి - యంత్రాంగం : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలు, అభ్యర్థుల అడ్డగింతల నడుమ ముగిసింది. మొదటి రోజు నుంచే కూటమి నేతల బలవంతంగా నామినేషన్ల పత్రాలు, దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులలో పోలీసుల కాల్పులు, పుంగనూరులో వాహనాల ధ్వంసం, దర్శిలో పోలీసులకు గాయాలు కావడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా.. గుత్తిలో ఎస్ఐ కాళ్లు పట్టుకుని అభ్యర్థి వేడుకున్నా ఫలితం లేకపోయింది. తిరుపతిలో 22 డివిజన్లలో వైసిపిని అడ్డుకోవడం, రాయచోటి, దర్శిలో వైసిపి ఒక్క నామినేషన్ కూడా వేయలేకపోయింది. మొత్తంగా ఈ మూడు రోజుల్లో ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆదివారం ఉదయాన్నే స్థానిక వైసిపి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అరెస్ట్ వార్త తెలియడంతో వైసిపి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో వైసిపి నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లగా, వారి నుంచి కూటమి నేతలు నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చింపివేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వైపు టిడిపి కార్యకర్తలు, డిఎస్పి కార్యాలయం వైపు వైసిపి కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఉత్కంఠ నెలకొంది.
పోలీసులతో వాగ్వాదం - తోపులాట, లాఠీ ఛార్జ్
పరిస్థితిని గమనించిన అధికారులు, మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్లు వేయడానికి రావాలని సూచించారు. దీంతో అప్పటివరకూ వేచి ఉన్న వైసిపి అభ్యర్థులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా డిఎస్పి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడే అడ్డుకోవడంతో, తమను నామినేషన్లకు అనుమతించాలని వైసిపి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి నిరాకరించడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో గుర్తు తెలియని వ్యక్తి కర్ర విసరడంతో ఎస్ఐకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. వైసిపి శ్రేణులు వెనక్కు తగ్గకపోవడంతో అభ్యర్థులు మాత్రమే ముందుకు రావాలని పోలీసులు కోరారు. దాంతో వైసిపి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డితో పాటు అభ్యర్థులు ముందుకు రాగా, పోలీసులు వారిని అక్కడే నిలిపివేశారు. సమయం దాటిపోతోందని, తమను లోపలికి అనుమతిం చాలని అభ్యర్థులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. డిఎస్పి బాలమురళి, సిబ్బంది అక్కడకు చేరుకుని వైసిపి అభ్యర్థులను నిలిపేశారు. అదే సమయంలో తహశీల్దారు అక్కడకు చేరుకోగా ఆయన కాళ్లా వేళ్లా పడి బతిమిలాడారు. సమయం అయిపోతుందని, నామినేషన్లకు అనుమతించాలని కోరారు. దీంతో విసుగెత్తిన వైసిపి అభ్యర్థులు డిఎస్పి కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నామినేషన్లకు సమయం ముగియడంతో వైసిపి శ్రేణులు నిరాశతో వెనుదిరిగారు. వైసిపి అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయలేదని తేలడంతో టిడిపి కార్యకర్తలు రోడ్డుపైనే సంబరాలు చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా నగరి 4వ వార్డు వైసిపి అభ్యర్థి తామరసెల్వి నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేయడం, ఆమెను బలపరచడానికి వచ్చిన మహేశ్వరన్పై దాడిచేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 36వ వార్డు వైసిపి అభ్యర్థి ఇంద్రయ్య నామినేషన్ పత్రాలను చించివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా..నామినేషన్ కేంద్రానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. కూటమి నాయకులు ఒక్కసారిగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. చివరకూ పోలీసుల భద్రత నడుమ వైసిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
గుత్తిలో ఎస్ఐ కాళ్లుపట్టుకుని వేడుకున్న వైసిపి అభ్యర్థి
‘సార్! నాతో నామినేషన్ వేయించండి. సమయం ముగిసిపోతుంది. మీ కాళ్లు పట్టుకుని అభ్యర్థిస్తున్నాను’ అంటూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాల్టీలో ఓ వైసిపి అభ్యర్థి ఎస్ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. గుత్తి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థిగా రంగస్వామి ఆదివారం నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. నామినేషన్లు వేయకుండా టిడిపి నాయకులు అడ్డుకోవడంతో వైసిపి నేతలు అక్కడే ధర్నాకు దిగారు. ‘సార్! నాతో నామినేషన్ వేయించండి’ అంటూ ఎస్ఐ సురేష్ కాళ్లు పట్టుకుని అభ్యర్థి ప్రాథేయపడ్డారు. అప్పటికే రంగస్వామి చేతిలోని నామినేషన్ పత్రాలను టిడిపి మద్దతుదారులు చించివేశారు. దీంతో రంగస్వామి నామినేషన్ వేయకుండానే వెనుదిరిగాడు.
తిరుపతిలో సిపిఎం అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేత
తిరుపతి 58వ వార్డు కార్పొరేటర్ గా సిపిఎం అభ్యర్థి రాధ నామినేషన్ వేసేందుకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు రాగా_ ఐదారు వందల మంది రౌడీమూకలు గుమిగూడి పత్రాలను బలవంతంగా లాక్కుని చించివేశారు. విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి హుటాహుటిన నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చి రోడ్డుపైనే పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల పాటు ధర్నా చేపట్టారు. పత్రాలను చించివేసిన కూటమి రౌడీమూకల నాయకుడు నేతల దగ్గరకు వచ్చి పత్రాలను సిద్ధం చేసి ఇస్తామని ‘సారీ’ చెప్పి గంటల వ్యవధిలోనే పత్రాలను తిరిగి సిద్ధం చేసి తీసుకొచ్చారు. దీంతో చివరి గడియల్లో మధ్యాహ్నం 2.40 నిమిషాలకు రాధ నామినేషన్ వేశారు.
పుంగనూరులో పోటీ చేయడం లేదు : పెద్దిరెడ్డి
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేయదలచుకోలేదని, టిడిపి కూటమి తీరు తాలిబన్ల కంటే దారుణంగా ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పుంగనూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేటలో టిడిపి కూటమి నాయకులు తాలిబన్లలా వ్యవహరిస్తూ వైసిపి అభ్యర్థులు నామినేషన్ వేయనీకుండా అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. తిరుపతిలోని మాజీ మంత్రి నివాసానికి చేరుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపి మిధున్ రెడ్డికి పుంగనూరు పోలీసులు ఉదయం నోటీసులు అందజేశారు.
వైఎస్ అవినాష్ హౌస్ అరెస్టు
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైసిపి కార్యాలయం వద్దకు ఎవ్వరూ రాకుండా ముళ్లకంచె ఏర్పాటు చేశారు. వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి వైయస్ ప్రమీలమ్మ ఇంటిదగ్గర పోలీసులు భారీగా మోహరించారు. నామినేషన్ వేయడానికి వెళుతున్న వైసిపి మహిళా అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు.
తిరుపతిలో 22 డివిజన్లలో వైసిపికి తప్పిన నామినేషన్ల అవకాశం
తిరుపతి కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా 22 డివిజన్లలో వైసిపి అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో ఒకటో వార్డు తప్ప వైసిపి వేయని 22 డివిజన్లలో జనసేన, టిడిపి, రెబల్ టిడిపిలు నామినేషన్ దాఖలు చేయడంతో, ఈ 22 డివిజన్లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి వైసిపి మేయర్ అభ్యర్థి వై.వాసు యాదవ్ నామినేషన్ వేయనీకుండా శనివారం అడ్డుకున్నారు.
రాయచోటి మున్సిపాలిటీ వార్డుల బరిలో లేని వైసిపి
కడప జిల్లాలో కమలాపురం, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఒక్క నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వైసిపి ఎన్నికల బరిలో లేకుండా పోయింది. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఎంపి మిథున్ రెడ్డితో కలిసి తొలిరోజు నలుగురు చైర్మన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ స్వీకరించలేదనే విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. రాయచోటి మున్సిపాలిటీలోని 44 వార్డులకు ఒక్క వార్డుకు కూడా వైసిపి నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం. దీంతో రాయచోటిలో మున్సిపల్ చైర్మన్, వార్డులకు పోటీలో లేని పరిస్థితి కనిపిస్తోంది.








కామెంట్లు (0)