శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: శారదా నది ఊబిలో మునిగి ఇద్దరు రైతులు మృతి

10 గంటల క్రితం

శారదా నది ఊబిలో మునిగి 
ఇద్దరు రైతులు మృతి
-కళ్లాలకు వెళ్తుండగా ఘటన
-వేరొక చోట ఒకరు గల్లంతు? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కళ్లాలకు వెళ్తుండగా ఘటన

- వేరొక చోట ఒకరు గల్లంతు?

ప్రజాశక్తి - చోడవరం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామం వద్ద శారదా నది ఊబిలో మునిగి ఇద్దరు రైతులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు... గోవాడ గ్రామానికి చెందిన సేనాపతి అప్పారావు (54), ఏడువాక నూకరాజు (45) శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే నదికి అవతల ఒడ్డున ఉన్న తమ కళ్లాలకు వెళ్లేందుకు శారదా నదిలోకి దిగారు. వారి వెంట మరో ఇద్దరు రైతులు ఉన్నారు. నీటిలో నడిచి వెళ్తుండగా అప్పారావు, నూకరాజు ప్రమాదవశాత్తు ఊబిలో మునిగిపోయారు. గమనించిన తోటి రైతు సేనాపతి స్వామి వారిని రక్షించబోయారు. ఆయనా మునిగిపోతుండగా మరో రైతు నాయుడు బయటికి లాగడంతో ప్రమాదం నుండి స్వామి బయటపడ్డారు. చోడవరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పారావు, నూకరాజుల మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్‌‌టిఆర్‌ ఆసుపత్రికి తరలించారు. నాగుల చవితి పండగ పూట రైతులు ఇలా మృతి చెందడంతో వారి కుటుంబాల్లోనూ, పరిసర ప్రాంత రైతుల్లోనూ తీవ్ర విషాదం నింపింది. అప్పారావుకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు జరిగాయి. నూకరాజుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు చదువుకుంటున్నారు. భార్య వెంకటలక్ష్మి బ్రాండిక్స్‌ ‌కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తున్నారు.

​ లక్కవరం గ్రామంలో రైతు గల్లంతు?

ఇదే మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన రైతు బండారు కృష్ణ శుక్రవారం ఉదయం పశువులను మేత కోసం శారదా నది పరిసర ప్రాంతాలకు తోలుకొని వెళ్లారు. సాయంత్రం వరకూ ఆయన తిరిగి రాలేదు. పశువులు మాత్రమే ఇంటికి చేరాయి. శారదా నదిలో కృష్ణ మునిగిపోయి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. చోడవరం అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు నదిలో గాలిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్