- సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
- నామినేషన్ల అడ్డగింతపై గవర్నరుకు జగన్ ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో టిడిపి నాయకులు అరాచకాలు సృష్టించారని గవర్నరు అబ్దుల్ నజీర్ దృష్టికి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లిన వైఎస్ జగన్.. గవర్నరుతో భేటీ అయ్యారు. మూడు రోజులుగా టిడిపి నాయకులు అరాచకాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఎస్ఇసి అనిల్‌చంద్ర పునేఠాను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణ పరిస్థితులను గవర్నరుకు వివరించామన్నారు. సిఎం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేదన్నారు. 8 మున్సిపాలిటీల్లో వైసిపి నాయకుల నామినేషన్లు వేయనీయకుండా చేశారని, మరో 8 చోట్ల టిడిపి నాయకులు చించేశారని పేర్కొన్నారు. ఎస్ఇసి పూర్తిగా లాలూచీ, రాజీ పడిన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఇలా ఉంటే...జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా దాటదని అన్నారు. వ్యవస్థలు ఇలా తయారైనప్పుడే కాక్రోచ్లు పుట్టుకొస్తాయన్నారు. నామినేషన్ల వ్యవస్థను ఆన్లైన్, సెంట్రలైజ్ చేయాలని గవర్నరును అడిగామని, పారామిలటరీ దళాలను దించాలని కోరామని తెలిపారు. పోలింగ్ బూత్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద, స్ట్రాంగ్ రూమ్‌లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై సుప్రీంను ఆశ్రయిస్తామన్నారు. నామినేషన్ల సందర్భాల్లో టిడిపి నాయకుల దాడి, కత్తిపోట్లతో వైసిపి నేతలకు గాయాలయ్యాయన్నారు. ఈ దాడులతో పాటు పులివెందులలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు. పులివెందులలో 16 వార్డుల్లో, ప్రొద్దుటూరులో 19, కడపలో 54 వార్డుల్లో వైసిపి నాయకుల నామినేషన్లను అడ్డుకున్నారన్నారు. యర్రగుంట్ల, కమలాపురం, రాయచోటిలో ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు పడకుండా టిడిపి అరాచకం సృష్టించిందన్నారు. రాజంపేట, బద్వేలులో ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, రాజంపేట, బద్వేలులో వార్డులకు నామినేషన్లు వేయనివ్వలేదన్నారు. దర్శిలో ఛైర్మన్ సహా 25 వార్డులకు నామినేషన్లు పడలేదని, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 4 వార్డుల్లో నామినేషన్లు వేయకుండా టిడిపి అడ్డుకుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదని, పరిస్థితి ఇలా ఉంటే ఎస్ఇసి ఏం చేస్తోందని అడిగామని జగన్ వివరించారు. డిఐజి కోయ ప్రవీణ్.. టిడిపి కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ వెంట మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
దాడులను ఎస్ఇసి, పోలీసులు పట్టించుకోవడం లేదు
రాష్టంలో జరుగుతున్న దాడులను ఎస్ఇసి, పోలీసులు పట్టించుకోవడం లేదని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. అంతకుముందు ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని తేల్చారని, చెల్లని ఆ ఓట్లతో ఎన్నికలకు పోవడంతోనే చంద్రబాబు కుట్ర మొదలైందని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. నామినేషన్ సెంటర్ దగ్గర వందలాదిమంది టిడిపి కార్యకర్తలు మారణాయుధాలతో గుమిగూడినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠను గతంలో చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నియమించారని, అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయని అన్నారు. పుంగనూరు దాడి ఘటనను ట్విస్ట్ చేయడానికి ధ్వంసమైన కార్లలో లిక్కర్ బాటిల్స్ పెట్టారన్నారు. మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. 9వ వార్డుకు నయాజ్ తన భార్యతో కలిసి నామినేషన్ వేయించేందుకు వెళ్తే, పోలీసుల సమక్షంలోనే ఆయన్ను కొట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని చెప్పారు. తిరుపతిలో తమ పార్టీ మేయర్ అభ్యర్థి వాసూ యాదవ్ నామినేషన్ వేయడానికి వెళ్తే, చంపేస్తామని బెదిరించారని అన్నారు. బద్వేలులో తమ పార్టీ వారు వేసిన నామినేషన్లను, ఆర్ఒ ఆఫీసులోకి చొరబడి, చింపేశారన్నారు. పులివెందులలో పోలీసులే గుండాలుగా మారారన్నారు. రాయచోటిలో తమ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పార్టీ ఆఫీస్‌లో ఉండగానే, ఆఫీస్‌కు నిప్పు పెట్టారని, వాహనాలు తగలబెట్టారంటూ వీడియోలను ప్రదర్శించారు.








కామెంట్లు (0)