శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతులకు అదనపు సుంకం మినహాయింపు..

4 గంటల క్రితం

పొగాకు రైతులకు అదనపు సుంకం మినహాయింపు
- టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : ​రాష్ట్రంలోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించిందని టుబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం గుంటూరు టుబాకో బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2025–26 పంట కాలానికి అనుమతి లేకుండా అనధికారికంగా పండించిన పొగాకు, రిజిస్టర్ కాని రైతులు పండించిన పొగాకుపై సాధారణంగా విధించే అదనపు సుంకాన్ని జీరో అదనపు సుంకంగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 44 వేల మంది పొగాకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, మొత్తంగా దాదాపు రూ.226 కోట్ల మేర ఆర్థిక ఉపశమనం లభించనుందని తెలిపారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, వివిధ దేశాల్లో అధిక ఉత్పత్తి తదితర కారణాలతో గత నాలుగు నెలలుగా పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఒక దశలో సుమారు 40 శాతం వరకు లోబిడ్ల పరిస్థితి నెలకొని, పొగాకు విక్రయించుకోవడం రైతులకు కష్టతరంగా మారిందన్నారు. రెండు, మూడు వారాలుగా పరిస్థితి క్రమంగా మెరుగుపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రేడ్, ఆఫ్ గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.పది చొప్పున ఆర్థిక సహాయం అందించి, దాదాపు రూ.94 కోట్ల మేర రైతులకు ఉపశమనం కల్పించిందన్నారు. 2025–26 సంవత్సరానికి పొగాకు బోర్డు నిర్దేశించిన ఉత్పత్తి పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 236 మిలియన్ కిలోల మేర పంటను పండించారని తెలిపారు. ప్రస్తుతం వేలం ప్రక్రియలో గణనీయమైన పరిమాణంలో పొగాకు విక్రయించామని, మిగిలిన పంటను కూడా వేగంగా విక్రయించేందుకు పొగాకు బోర్డు చర్యలు కొనసాగిస్తోందని చైర్మన్ తెలిపారు. వేలం విభాగం సంచాలకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్