- అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి
- శ్రీ సత్యసాయి జిల్లాలో సిపిఎం జీపుజాతా ప్రారంభం
ప్రజాశక్తి - మడకశిర టౌన్ : తీవ్రమైన కరువుతో శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాల రైతులు సతమతం అవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి అన్నదాతలను ఆదువాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన జిల్లాలో జీపుజాతా శనివారం ప్రారంభమైంది. మడకశిరలో ప్రారంభం అయిన జాతా పరిగి, చిలమత్తూరు, హిందూపురం తదితర మండలాల్లో కొనసాగింది. ఆయా మండలాల్లో జాతా బృందం పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడింది. వర్షాభావంతో పంటలు మొత్తం చేతికందకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర పట్ణణంలోని జాతా ప్రారంభం సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో పంటలను రైతులు మొత్తం నష్టపోయారని, జిల్లాలోని 33 మండలాలనూ కరువు మండలాలుగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ పశుగ్రాసం కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని, హంద్రీనీవా నీటితో జిల్లాలోని అన్ని చెరువులనూ నింపాలని, ఉపాధి హామీ పనిదినాలు విరివిగా కల్పించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, పంట సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు ఇదే రకంగా నష్టపరిహారం ఇవ్వాలని, బ్యాంకుల్లో రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసి కొత్త రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సిఐటియు మండల కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం జిల్లా నాయకులు రామాంజనేయులు, యోగానంద వీరేష్, బాబా, రమేష్ గౌస్ గోవిందప్ప పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)