- పేదరిక నిర్మూలనకు పురస్కారం.. కుప్పం P4కు స్కోచ్ అవార్డు
- న్యూఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకున్న కడ పిడి వికాస్ మర్మత్
ప్రజాశక్తి -కుప్పం : స్వర్ణ కుప్పం–విజన్ 2029లో భాగంగా కుప్పం ప్రాంతంలో అమలు చేస్తున్న జీరో పావర్టీ–P4, నెట్ జీరో కుప్పం కార్యక్రమాలకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, పలమనేరు-కుప్పం- మదనపల్లె (పికెఎం) ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ఈ అవార్డు అందుకున్నారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి అవకాశాల కల్పన, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పి-4 కార్యక్రమం ద్వారా కుప్పం ప్రాంతంలో గుర్తించిన 8,904 బంగారు కుటుంబాలకు అదాని, టివిఎస్, ఎంఇఐఎల్ తదితర సంస్థల సహకారంతో వివిధ రంగాల్లో జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, డెయిరీ, గొర్రెలు–మేకల పెంపకం, రిటైల్, టైలరింగ్, ఆహార వ్యాపారాలు, ఆటోలు, మినీ ఫ్లోర్ మిల్లులు, మెకానిక్ సెంటర్లు, సిల్క్ రీరింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో కుటుంబాలకు ఆర్థిక స్వావలంబనకు సహకారం అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,217 కుటుంబాలకు రూ.8.71 కోట్ల మేర మద్దతు అందించినట్లు, అదేవిధంగా కుప్పంను నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా కడ, ఐఐటి కాన్పూర్ తదితర సంస్థల సహకారంతో సౌర విద్యుత్, రూఫ్‌టాప్ సోలార్, స్మార్ట్ మీటరింగ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమాలకు స్కోచ్ అవార్డు దక్కడం కుప్పం అభివృద్ధికి నిదర్శనమని సురేష్ బాబు తెలిపారు.








కామెంట్లు (0)