ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : ‘పేదలకు పట్టాభిషేకం’లో సిఎం ప్రసంగం ముగిసిన అనంతరం, వేదికపై కేవలం పది మందికి మాత్రమే స్వయంగా పట్టాలను అందజేశారు. సిఎం అక్కడి నుండి వెళ్లిన అనంతరం మిగిలిన లబ్ధిదారులందరికీ మైదానంలో ముందుగానే ఏర్పాటు చేసిన దాదాపు 100 కౌంటర్ల ద్వారా తహశీల్లార్ల సంతకంతో కూడిన లబ్ధిదారుల గుర్తింపు పత్రాలను మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. ఈ గుర్తింపు పత్రాలు అందుకున్న వారందరూ తదుపరి ప్రక్రియలో భాగంగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ స్థలాలను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు. అయితే నేరుగా పట్టాలు ఇస్తారన్న ఆశతో వచ్చిన లబ్ధిదారులు అసహనంతో బయటకు వెళ్లిపోయారు.
సభకు జనం తరలింపు..
ఈ సభకు కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల నలుమూలల నుండి ప్రజలను తరలించారు. విజయవాడలో ఆయా డివిజన్లకు చెందిన టిడిపి ఇన్చార్జులు, కూటమి నేతల ఆధ్వర్యాన డీజేలు, తీన్మార్ డప్పు వాయిద్యాలు, పసుపు జెండాలతో పాదయాత్రలుగా, సభా ప్రాంగణానికి ప్రజలను తరలించారు. సింగ్నగర్ రోడ్డంతా పచ్చమయంగా మారింది. ప్రత్యేక బస్సులలో ప్రజలను పెద్ద ఎత్తున జనాలను తరంలించారు.









కామెంట్లు (0)