మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రమాద పరిహార చెల్లింపునకు భవిష్యత్ ఆదాయాన్నీ పరిగణించాలి

16 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హైకోర్టు తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : మోటారు వాహన ప్రమాద పరిహారం లెక్కించేటప్పుడు మరణించిన వ్యక్తి స్థిర వేతనంతోపాటు భవిష్యత్తు ఆదాయ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం ఖరారులో మల్టిప్లయర్‌ను మరణించిన వ్యక్తి వయసు ఆధారంగానే నిర్ణయించాలని, ఆయన తల్లి వయసును ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం స్థిర వేతనంపై 40 శాతం భవిష్యత్తు ఆదాయ పెంపును వర్తింపజేయాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ తీర్పు వెలువరించారు.

అనంతపురం జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఉయ్యాల నాగమునిరెడ్డి 2009 జనవరి 2న తన తండ్రితో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. హైదరాబాద్‌లోని జి4 సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయనకు నెలకు రూ.4,238 నికర వేతనం వచ్చేది. ఆయన కుటుంబ సభ్యులు రూ.6 లక్షల పరిహారం కోరగా, ట్రిబ్యునల్ 2011లో రూ.3,85,420 ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని పెంచాలని కోరుతూ కుటుంబ సభ్యులు 2012లో హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తు ఆదాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మల్టిప్లయర్ నిర్ణయంలో తప్పిదాలను గుర్తించిన హైకోర్టు పరిహారాన్ని రూ.7.74 లక్షలకు పెంచింది. ప్రమాద పరిహార చెల్లింపునకు భవిష్యత్తు ఆదాయాన్నీ పరిగణించాలని తీర్పు వెలువరించింది.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్