- కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవంలో వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన పోరాట లక్ష్యాలతో 1998 అక్టోబరు 2న ఏర్పడిన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలోని ఫూలే అంబేద్కర్ భవనం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జెండాను దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా దళితులపై కులవివక్ష, అంటరానితనం, సామాజిక వివక్ష పూర్తిగా అంతం కాలేదన్నారు. గ్రామాల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కులవివక్ష కొనసాగుతోందని తెలిపారు. దళితులు, పేదలు, కార్మికులు, బలహీన వర్గాలను ఐక్యం చేసి సామాజిక న్యాయం కోసం విశాల ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు మతోన్మాద బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కారుచౌక్‌గా అమ్మేస్తూ దేశాన్ని నాశనం చేస్తూ, రిజర్వేషన్స్ లేకుండా చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతుంటే సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.
కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. 29 ఏళ్లుగా కెవిపిఎస్ కులవివక్ష నిర్మూలన కోసం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేలాది గ్రామాల్లో కులవివక్షపై అధ్యయనాలు నిర్వహించి వివక్ష రూపాలను వెలుగులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఉమ్మడి బావుల్లో నీళ్లు తోడుకోనివ్వకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, ఆలయ ప్రవేశం నిరాకరించడం, క్షవరం చేయకపోవడం, శ్మశాన వాటికల్లో స్థలం నిరాకరించడం వంటి అనేక వివక్షలను కెవిపిఎస్ పోరాటాల ద్వారా ఎదుర్కొందని వెల్లడించారు. కులవివక్షపై ప్రత్యేక కమిషన్ కోసం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పడిందన్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన స్థలం కోసం శవపేటికలతో చలో అసెంబ్లీ, కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉద్యమాలు నిర్వహించామని, వాటి ఫలితంగా జిఓ 1235 సాధించామని తెలిపారు. దళిత, గిరిజన జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఎస్‌సి కార్పొరేషన్ రుణ బకాయిల రద్దు, దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కూడా కెవిపిఎస్ పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించిందన్నారు. నేడు అదే స్ఫూర్తితో కులవివక్ష లేని సమాజం కోసం సమస్యల పరిష్కారానికి ఉద్యమం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు జి క్రాంతికుమార్, రవి, శ్యామ్, యేసోబు, విజయ్, కిరణ్, గంగాధర్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)