-వారం రోజుల్లో అర్నబ్, మురసు
-మూడో తుపాన్ ప్రచారంతో ఆందోళన
ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని నిర్మాణం 2028 నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వరద బెడద ఆటంకంగా పరిణమించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పీడ్ గా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులకు వారంలో రెండు తుపాన్లు, ఎడతెగని వర్షాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వం వరద నియంత్రణకు ఉండవల్లి దగ్గర కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, నీరుకొండ, శాఖమూరు, కృష్ణాయపాలెంలో రిజర్వాయర్లు ఏర్పాటు లాంటి చర్యలు తీసుకున్నా వరద నియంత్రణ చర్యలు పూర్తిగా సఫలం కాలేదు. అధిక వర్షాల వల్ల నిర్మాణ ప్రదేశాల్లో వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. సాధారణంగా జూన్, జులై లో అధిక వర్షాలు కురిసి నిర్మాణ పనులకు అంతరాయం కలిగేది. ఈసారి అందుకు భిన్నంగా వర్షాలు కురవకపోవడంతో అమరావతి నిర్మాణ పనులు సాఫీగా సాగాయి. గత నెల 28 న అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఎడతెగని వర్షాలకు అమరావతి పనులకు ఇబ్బంది తలెత్తింది. ఎల్‌పిఎస్ ప్లాట్లలో భూగర్భ విద్యుత్ సరఫరా లైన్లు, వర్షపు నీటి కాలువల ఏర్పాటు, ఐసిటి నెట్ వర్క్ వ్యవస్థ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు కనెక్టివిటి రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అర్నబ్ తుపాన్ తో వరద నీరు చేరి ఈ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రైతుల ఎల్‌పిఎస్ ప్లాట్లలోకి నీరు చేరడంతో పనులు సాగడం కష్టంగా మారింది. వీటితో పాటు రహదారుల పనులకు కూడా ఇబ్బంది ఏర్పడింది. పనులు కొనసాగించేందుకు ఇంజన్లతో నీటి తోడించేందుకు అధికారులు ఉపక్రమించారు. ఇది కొనసాగుతుండగానే వారం రోజులు కూడా గడవకుండానే మరో తుపాన్ మురసు ముంచుకు రావడంతో అమరావతికి వరద ముంపు బెడద ఎక్కువైంది. అధిక వర్షాలకు కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, ఎర్ర వాగు తదితర వాగులు పొంగి పొర్లడం అమరావతికి ముప్పుగా పరిణమించింది. కొంతమేర వరద నీటిని అధికారులు అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్‌లోకి పంపినప్పటికీ సమస్య తొలగలేదు. వరద నీటి కారణంగా కొన్నిచోట్ల పనులు తాత్కాలికంగా నిలిచిపోయినా పునాదుల ప్రక్రియ పూర్తయిన భవనాల నిర్మాణ పనులు యథావిధిగా సాగుతున్నాయి. ఐకానిక్ భవనాలు, జడ్జీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రుల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎల్‌పిఎస్ ప్లాట్లు, ఇతర చోట్ల కూడా పూర్తి స్థాయిలో పనులు జరిగేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో తుపాన్ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. అమరావతికి నీటి ముంపు సమస్య శాశ్వతంగా తప్పేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.









కామెంట్‌లు (0)