- టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసిపి వక్రీకరిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువును పెంచాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని వక్రీకరిస్తోందని, ఇది ముమ్మాటికీ పచ్చి అబద్ధమని తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు అక్రమాలు, హింస కారణంగా నామినేషన్ వేయలేకపోయామని తగిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోమని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. కానీ గడువు పెంచారని సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇలా వక్రీకరిస్తారా? అని నిలదీశారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థ ఆదేశాలను సైతం అబద్ధాలతో బురదజల్లాలని చూస్తున్న జగన్ దిగజారుడు రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. జగన్ ఆదేశాల మేరకే వైసిపి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి పీతాల సుజాత మరో సమావేశంలో ఆరోపించారు. ఎంపిలుగా ఉన్న అవినాష్, మిథున్ రెడ్డిలు వందలమందిని నామినేషన్ కేంద్రాలకు తీసుకురాకూడదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు, మేయర్, చైర్మన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అంతటా ప్రశాంతంగా సాగుతుంటే జగన్ తన సొంత ఉమ్మడి జిల్లాల్లో రౌడీయిజం, దందాగిరి చేయిస్తూ పెడబొబ్బలు పెడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సమావేశంలో ఆరోపించారు.







కామెంట్లు (0)