mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేలా.. అదిరేలా..

24 మే, 2026

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం


  • సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం భారీగా కదిలొచ్చిన గిరిజనం

  • ఆకుపచ్చ జెండాలతో ర్యాలీ, బహిరంగ సభ

ప్రజాశక్తి- చింతూరు, రాజవొమ్మంగి : ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, హక్కులు, చట్టాల పటిష్ట అమలు కోసం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన మూడు రోజులపాటు పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో తలపెట్టిన రేలా ఉత్సవాలు తొలి రోజైన ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆదివాసీలు ఈ ఉత్సవాలను చూసేందుకు పోటెత్తారు. పోలవరం జిల్లాలోని 12 మండలాల నుంచే కాకుండా అల్లూరి జిల్లా, తెలంగాణ ప్రాంతం నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రంపచోడవరం కిక్కిరిసిపోయింది. ఆకుపచ్చని జెండాలు చేబూని అందరూ కదులుతూ ఉంటే ప్రకృతి మురిసినట్టయింది. స్థానిక సిరిగిందలపాడు నుంచి అంబేద్కర్ సెంటర్, ఫారెస్ట్ చెక్‌పోస్ట్ మీదుగా రేలా ఉత్సవాల సందర్భంగా ర్యాలీ సాగింది. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, గిరిజన మేధావులు, ప్రముఖులు ఈ ర్యాలీ అగ్రభాగాన నడిచారు. రేలా డప్పుల మోత, థింసా నృత్యాలు, జానపద కళారూపాలు ర్యాలీలో ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి అక్కడా గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకూ ర్యాలీ సాగిన అనంతరం అక్కడి వేదికపై ఇంకొన్ని గిరిజన సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ ‌జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి హక్కుల కోసం పోరాడితే తప్పకుండా సాధించుకోవచ్చునన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. వారి బలమేంటో వారి నీతి నిజాయితీ, కట్టుబాట్లు, సంప్రదాయ ఆచారాలను చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు. ఆదివాసీల్లో ఎన్ని తెగలు ఉన్నప్పటికీ ఆదివాసీలుగా అంతా కలిసి మెలిసి ఉండాలన్నారు. పోలవరం నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆదివాసీలకు ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జిఒ నెంబర్‌ 3‌ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఆదివాసీలు ఐక్యంగా లేకపోతే అణగారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేలా ఉత్సవాలు వంటివి జరిపి ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు తెలియజెప్పాలన్నారు. ఎస్‌‌టి కమిషన్‌ ‌సభ్యులు గొర్లె సునీత మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నానాటికీ ఆదివాసీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అడవిని నమ్ముకొని ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలకు ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించాల్సి ఉందన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ గిరిజనుల జీవితాలు మెరుగుపడాలన్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా చట్టసభల్లో గిరిజనులు ఉండాలన్నారు. ఆదివాసీల జీవన విధానం, వ్యవసాయ పద్ధతులు ఎంతటి గొప్పవో తెలియజెప్పారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బొప్పెన కిరణ్‌, ఎంపిపి కారం లక్ష్మి, ఆదివాసీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు జి.నారాయణరావు, బి వరప్రసాద్, సున్నం రాజులు, పండ సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్