శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫ్రూట్‌బౌల్ ఆఫ్ వరల్డ్‌‌గా రాయలసీమ

1 రోజు క్రితం

ఫ్రూట్‌బౌల్ ఆఫ్ వరల్డ్‌‌గా రాయలసీమ
-చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌‌ల ప్రకటన 
_ఆంధ్ర బిడ్డగా భావించండి : అనంత్‌ అంబానీ
- రాయలసీమ ఉద్యాన హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌‌ల ప్రకటన

- ఆంధ్ర బిడ్డగా భావించండి : అనంత్‌ అంబానీ

- రాయలసీమ ఉద్యాన హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

​ప్రజాశక్తి - కడప ప్రతినిధి: రాయలసీమను ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ ప్రకటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రూ. లక్ష కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఎ)కు శుక్రవారం వారు శంకుస్థాపన చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య ఆలోచనలను వాస్తవం చేస్తూ కరువు సీమలో రూ.లక్ష కోట్లతో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టామన్నారు. దీంతో 201 క్లస్టర్లు, 303 మండలాల్లో 5,869 గ్రామాలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. 37,50,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుతో పది లక్షల మంది రైతులకు, 49 లక్షల మంది ప్రజలకు ఉపాధి లభించనుందన్నారు. రాయలసీమలో ఆపిల్ నుంచి అవకాడో వరకూ 20 రకాల పంటలు పండుతాయని, ఇన్ని రకాల పంటలు పండే ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ప్రాసెసింగ్ ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తుందని, భవిష్యత్తులో రాయలసీమను కరువుసీమ నుంచి సిరుల సీమగా మారుస్తామన్నారు. రాయలసీమలో డిఫెన్స్, ఎయిర్‌‌పోర్టు, నాలుగు వరుసల రైల్వే లైన్ సదుపాయాలతో వరల్డ్ క్లాస్ లాజిస్టిక్స్‌తో ప్రపంచానికి అనుసంధానిస్తామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ పేజ్-2, జిఎన్ఎస్ఎస్ ఫేస్-2, వేదవతి, బైరవానితిప్ప, అప్పర్ పెన్నార్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.

​కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ., మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని హార్టికల్చర్‌ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు ప్రవేశపెట్టామన్నారు. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాయలసీమను వాటర్ సెక్యూరిటీ రీజియన్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, అవకాశాలకు నిలయంగా సీమ కొత్త చరిత్రను లిఖిస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, కడప జిల్లా నుంచి ప్రారంభించిన యువగళం పాదయాత్ర సందర్భంగా మిషన్ రాయలసీమ డిక్లరేషన్ లో హార్టికల్చర్‌ హబ్‌‌గా మారుస్తామని హామీ ఇచ్చానని, నేడు నెరవేర్చానని తెలిపారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థ ప్రారంభంతో రాయలసీమ దశ, దిశా మారబోతోందని తెలిపారు. దీని ద్వారా పది జిల్లాలో పండించిన పంటలకు మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. ​రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ మాట్లాడుతూ... తనను ఆంధ్ర బిడ్డగా భావించాలని.. రాష్ట్రానికి అందించాల్సిన సహకారంపై మార్గనిర్దేశం చేయాలని చంద్రబాబును కోరారు. ​బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.విఎన్ మాధవ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దగాపడ్డ రాయలసీమ, కరువు సీమ వంటి పదాల స్థానంలో సిరులు గొలిపే రాయలసీమ వంటి పదాలు వినబోతారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్