సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదు రోజుల బ్యాంకింగ్‌ కోసం బ్యాంకు ఉద్యోగుల సమరశంఖం

9 గంటల క్రితం

ఐదు రోజుల బ్యాంకింగ్‌ కోసం బ్యాంకు ఉద్యోగుల సమరశంఖం
-నేటి నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మె
-డిమాండ్లపై కేంద్రం స్పందించకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మె
-యుఎఫ్‌బియు పిలుపుతో ఉద్యమం
-బ్యాంకు ఉద్యోగుల ఐక్యతే ఉద్యమానికి బలం
-ఎస్‌బిఐఒఎ(ఎసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జికె విశ్వనాథ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 08:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేటి నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మె

- డిమాండ్లపై కేంద్రం స్పందించకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మె

- యుఎఫ్‌బియు పిలుపుతో ఉద్యమం

- బ్యాంకు ఉద్యోగుల ఐక్యతే ఉద్యమానికి బలం

- ఎస్‌బిఐఒఎ(ఎసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె విశ్వనాథ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు స్టేట్‌ ‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్‌ (అమరావతి సర్కిల్‌) ఎస్‌బిఐఒఎ (ఎసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె విశ్వనాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయనను కలిసిన ప్రజాశక్తితో మాట్లాడుతూ... యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు ఈ సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలుపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు, వినతిపత్రాలు, నిరసనలు, సమ్మెలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. 2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్‌ నోట్‌ సందర్భంగా ఈ సమస్యలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో యుపిఐ, ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎటిఎంలు వంటి డిజిటల్‌ సేవలు విస్తరించినప్పటికీ ఉద్యోగులపై పని భారం పెరిగిందని తెలిపారు. వ్యాపార లక్ష్యాలు, కేవైసి, నియంత్రణ నిబంధనలు, కస్టమర్‌ సేవలు, పరిపాలనా బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో ఐదు రోజుల పని విధానం ఉద్యోగులకు పని జీవిత సమతుల్యతకు దోహదపడుతుందని చెప్పారు. జనవరి 27న దేశవ్యాప్త సమ్మె, ఆగస్టు 12న నిరసన, సెప్టెంబర్‌ 11న ఒకరోజు సమ్మె నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా, క్రమశిక్షణతో సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ పోరాటం ఖాతాదారులకు వ్యతిరేకం కాదని, ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన పని పరిస్థితుల కోసం చేపడుతున్న ఉద్యమమని తెలిపారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలయ్యే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మా ప్రధాన లక్ష్యం ఎప్పటికీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమేనని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకు ఉద్యోగులు ఎల్లప్పుడూ అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. అన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా, క్రమశిక్షణ, శాంతియుతంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మన ఐక్యతే, మన ఉద్యమానికి అతి పెద్ద బలమని, ఐదు రోజుల బ్యాంకింగ్ సాధించే వరకు మన సమిష్టి కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్