బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత..

05 అక్టోబర్, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో అనేకేళ్లుగా సేవలందిస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో 190 పాఠశాలల్లో వివిధ తరహా కేడర్లలో పార్ట్-టైమ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు సుమారు 1,673 మంది అనేకేళ్లుగా పని చేస్తున్నారని, వీరంతా దళిత పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సేవలందిస్తున్నారని తెలిపారు. క్వాలిఫైడ్ టీచర్లయినా పార్ట్-టైమ్‌గా నియమితులయ్యారని, వీరిలో సగం మంది మహిళలని వివరించారు. వాస్తవంగా ఉదయం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు బోధనతో పాటు హౌస్ టీచర్ బాధ్యతలు, స్టడీ అవర్స్, సెలవు రోజుల విధులు, నైట్ డ్యూటీలు, మెస్ నిర్వహణ, సహపాఠ్య కార్యక్రమాలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారానికి సుమారు 32-38 బోధనా పీరియడ్లు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి అందుతున్న వేతనం అందులో నాలుగో వంతని, సుమారు రూ.14 వేల నుండి రూ.24 వేలు మాత్రమేనని తెలిపారు. చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అవి కూడా రెగ్యులర్‌గా రావడం లేదని వివరించారు. ఇతర ఉద్యోగులకు వర్తించే ఎలాంటి సెలవులూ లేవని, పిఎఫ్, ఇఎస్‌ఐ వర్తించదని, వీరి సమస్యలు చెప్పుకునేందుకు కేంద్ర ఆఫీస్‌లో లైజినింగ్ ఆఫీసర్ లేరని లేఖలో పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వపరంగా ఎదురవుతున్న సమస్యలైతే వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో వివక్షతో కూడిన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని, ఉదాహరణకు వీరిని స్టాఫ్ రూమ్‌లో అందరితో సమానంగా కూర్చోడానికి అనుమతించరని తెలిపారు. గత్యంతరం లేక వారి సమస్యల పరిష్కారం కోసం గత ఎనిమిది రోజుల నుండి ఆందోళన చేస్తున్నారని, అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, వెంటనే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. పరిపాలనా, ఉద్యోగ సంక్షేమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ (లైజాన్) ఆఫీసర్‌ను నియమించాలని, వారి సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని పరిష్కారానికి చొరవ చూపించాలని సిఎం చంద్రబాబును శ్రీనివాసరావు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్