- తప్పుడు రికార్డులతో భూములు కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి : వి శ్రీనివాసరావు
- చిలకపాలెంలో రైతుల పాదయాత్ర ప్రారంభం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : తప్పుడు రికార్డులతో భూములు కాజేస్తున్న భూ బకాసురులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో నారాయణపురం భూసాగుదారులకు సాగు హక్కు పట్టాలు ఇవ్వాలని కోరుతూ భూసాగు హక్కుదారుల పోరాట కమిటీ ఆధ్వర్యాన రైతులు చేపట్టిన పాదయాత్రను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర రెండు రోజులపాటు సాగనుంది.
ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు టి.నందోడు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘మీ భూమి - మీ హక్కు’ అని అమరావతిలో చెప్తున్న చంద్రబాబుకు... చిలకపాలెం రైతుల విషయంలో అమలు కాదా? అది ప్రభుత్వ వైఫల్యమా? చేతగానితనమా? అని ప్రశ్నించారు. వాటాల కోసం దొంగ భూ బకాసురులకు కొమ్ముక ాస్తున్నారా అని నిలదీశారు. వైసిపి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, జగన్ బొమ్మ వేసుకుని మీ భూములు తీసుకుంటారని, తాము వస్తే మీ భూములను మీకే అప్పగిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, చిలకపాలెంలో తరతరాలుగా నారాయణపురం భూములను సాగు చేస్తున్న రైతులకు ‘మీ భూమి, మీ హక్కు’ కింద స్వాధీనం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని, ఇది వంచనా కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగైదు లక్షల ఎకరాలను ఉచితంగా ఇచ్చేశారని తెలిపారు. విశాఖపట్నంలో అదానీ గూగుల్ సెంటర్ కోసం 600 ఎకరాలను ఎకరా 99 పైసలకు ఇచ్చేసిందన్నారు. యూనిట్ కరెంట్‌కు ప్రజలు ఏడు రూపాయలు చెల్లిస్తుంటే, ప్రభుత్వం డేటా సెంటర్‌కు రూపాయికే ఇస్తోందని వివరించారు. తాగేందుకు నీళ్లు లేక, సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే, అదానికి మాత్రం ప్రత్యేకంగా పైపులైన్లు వేసి గోదావరి జలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇచ్చి పండగ చేసుకోమని చెప్తున్న ప్రభుత్వం, అదాని డేటా సెంటర్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. గత 12 ఏళ్లుగా పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్నారని, ఎక్కడ పరిశ్రమలు పెట్టారో వైసిపి, టిడిపి చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతుల మెడపై కత్తి పెట్టి మరో లక్ష ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్న వారిని ఓడించి శంకరగిరి మాన్యాలు పట్టిస్తేగానీ పాలకులకు బుద్ధి రాదన్నారు. చిలకపాలెం రైతుల భూ సమస్యకు జిల్లాలోనే పరిష్కారం చూపి, వారు అమరావతి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ రైతులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, తాము సాగు చేస్తున్న భూములకే హక్కులు అడుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతుల పక్షమా?, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పక్షమా? చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమం తీవ్రం కాక ముందే మేల్కోవాలని హితవు పలికారు. ఇ-క్రాప్‌లో పంటలను నమోదు చేసి, రైతులకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రకు బ్రహ్మరథం
చిలకపాలెం యాదవ వీధి నుంచి చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువకులు రెడ్ షర్టులు ధరించి పాల్గొన్నారు. జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఆయా గ్రామాల్లో పలుచోట్ల మహిళలు పూలు చల్లి స్వాగతం పలికారు. ప్రజా, కార్మిక సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. చిలకపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర తొలి రోజు ఎచ్చెర్ల, కేశవరావుపేట, కింతలి మిల్లు, నవభారత్ కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)