- రైతు సంఘం, కెవిపిఎస్, సిఐటియు, వృత్తిదారుల సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన పేటల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగుచూసిన సామాజిక, ఆర్థిక, మౌలిక సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 30న విజయవాడ ధర్నా చౌక్‌లో ‘దళిత ఘోష–సామాజిక శంఖారావం’ పేరుతో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం, కెవిపిఎస్, సిఐటియు, వృత్తిదారుల సంఘాల నాయకులు తెలిపారు. 1,600కు పైగా గ్రామాల్లో గుర్తించిన సమస్యలకు పరిష్కారం కోరుతూ నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలోని ఎంబివికె సమీపంలోని బాలోత్సవ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 960కు పైగా గ్రామాల్లో దళిత, గిరిజన కాలనీలకు స్మశానవాటికల సమస్య ఉందని తెలిపారు. జిఒ 1235 ప్రకారం స్మశాన సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో అది అమలు కావడం లేదన్నారు. ఎస్‌సి,ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు కేటాయించి, ఆ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు సంబంధించిన భూ సమస్యలు అనేకం ఉన్నాయని తెలిపారు. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సుల ప్రకారం భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలని అన్నారు. దళిత, గిరిజనులకు ఉన్న భూములను వివిధ ప్రభుత్వ అవసరాల పేరుతో తీసుకుంటున్నారని విమర్శించారు. కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, కులవివక్ష ఘటనలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేయకపోవడం, కేసులను రాజీ చేయడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 35 మంది దళితులు హత్యలకు గురయ్యారని, కొన్ని పోలీసులపై ఆరోపణలు ఉన్నాయన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగినా పట్టించుకోని ప్రభుత్వం, రాజకీయ పలుకుబడి ఉన్న కులాలకు చెందిన వ్యక్తులు హత్యలకు గురైన వెంటనే స్పందించి పరామర్శించి, నష్టపరిహారాలను అందిస్తున్నారని విమర్శించారు. ఈనెల 30న జరిగే మహాధర్నాకు ఎస్‌సి, ఎస్‌టి, బలహీన వర్గాలు, సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.







కామెంట్‌లు (0)