- ఇప్పటికైనా 50% పరిమితిని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి
- సిపిఐ(యం) డిమాండ్
ప్రజాశక్తి-విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసింది, నిజాయితీ ఉంటే ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మొత్తం రిజర్వేషన్స్ 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసి కూడా ఎన్నికల లబ్ధి కోసం బిసిలకు 34% రిజర్వేషన్స్ అమలుకు సిద్ధమని కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్స్‌పై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలనలో ఉందని హైకోర్టులో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరో వైపు 34 శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తామని చెప్పడం బిసిలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైన బిల్లులన్నింటికీ మద్ధతిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బిసిలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆటంకంగా ఉన్న 50% పరిమితిని ఎత్తివేయడానికి పార్లమెంట్‌లో చట్ట సవరణకు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వారాల ముందు 34% రిజర్వేషన్స్ అంశం ముందుకు తీసుకరావడం బిసిలను దగా చేయడానికి కూటమి ప్రభుత్వం ఆడిన నాటకంగా హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరింది.







కామెంట్‌లు (0)