- సెన్సెక్స్ 1248 పాయింట్ల పతనం
- రూ.4.05 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ర్టీట్ బేజారయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, అమెరికా బాండ్ రాబడులు 19 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, ముడిచమురు ధరలు ఎగబాకడం వంటి పరిణామాలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం మార్కెట్లు కుప్పకూలాయి. ఒక్కపూటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు పైగా ఆవిరయ్యింది. అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,247.71 పాయింట్లు లేదా 1.67 శాతం పతనమై 73,580.54కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సూచీ 383.70 పాయింట్లు లేదా 1.64 శాతం నష్టపోయి 23,063 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.4.05 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.480.95 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. మార్కెట్లలో భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ ఏకంగా 22 శాతానికి పైగా ఎగబాకడం ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెంచింది.
ఒక్క ఎన్‌టిపిసికే లాభాలు..
అమ్మకాల ఒత్తిడి కేవలం భారీ కంపెనీలకే పరిమితం కాలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 2.25 శాతం, స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.53 శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఎన్‌టిపిసి మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలను చవి చూశాయి. మార్కెట్ పతనంలో ఆర్థిక రంగ షేర్లు అధికంగా దెబ్బతిన్నాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు ఏకంగా 5.47 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 4.67 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.06 శాతం చొప్పున క్షీణించాయి. ఇండిగో 2.78 శాతం, ట్రెంట్ 2.75 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.31 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.25 శాతం మేర నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో 2,587 షేర్లు నష్టపోగా, 943 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
ప్రధాన కారణాలు..
అమెరికాలో10 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడులు 2007 తర్వాత అత్యధికంగా 5.106 శాతానికి చేరాయి. అధిక బాండ్ రాబడుల నేపథ్యంలో ఈక్విటీలతో పోలిస్తే డెట్ మార్కెట్లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్‌లో మరోసారి వడ్డీరేట్లు పెంచవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అధిక వడ్డీరేట్ల అవకాశాలు పెరగడంతో విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్లే భయాలు మదుపుదారులను అప్రమత్తం చేశాయి. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు పైగా చేరాయి. భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయం, కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఈ భయాలు కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపుదారుల నిరంతర అమ్మకాలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో రూపాయి కూడా తీవ్ర ఒత్తిడికి లోనైంది. డాలర్‌తో మారకంలో ఒక దశలో రూపాయి విలువ 95.96కు పడిపోయింది. అమెరికా బాండ్ రాబడులు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు స్థిరపడే వరకు దేశీయ స్టాక్ మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా ఫెడ్ తదుపరి నిర్ణయాలు, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలపై మార్కెట్ దిశ ఆధారపడి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.







కామెంట్‌లు (0)