గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాఫ్ట్ టెన్నిస్ లో సరికొత్తగా…

16 మే, 2026

new star
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 05:26 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ, సరికొత్త ప్రయోగాలతో అద్భుతంగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో సత్తాచాటుతోంది ఆకేటి శ్రీ వైశాలి. పరిణితి చెందిన క్రీడాకారిణిగా సాఫ్ట్ టెన్నిస్‌లో పలు పతకాలు కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఏ స్థాయిలో జరిగే పోటీల్లోనైనా మంచి ప్రతిభ ప్రదర్శించే సామర్థ్యం శ్రీవైశాలి సొంతం. ప్రతిరోజూ కఠోర శ్రమ చేస్తూ సాధనలో మునిగితేలుతోంది. కొత్త ప్రయోగాలు చేస్తూ పోటీల్లో సరికొత్త వ్యూహాలతో రాణిస్తోంది.
విజయవాడలో నివసిస్తున్న ఆకేటి శ్రీహరిరావు, పద్మజ దంపతుల కుమార్తె శ్రీవైశాలి. 2012 ఏప్రిల్ 19న జన్మించిన ఆమె ప్రస్తుతం తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. సాఫ్ట్ టెన్నిస్‌లో క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. విజయవాడ రూరల్ మండలం కానూరులోని కెనడీ స్కూలులో ఈ ఏడాది పదో తరగతి చదవబోతోంది. తల్లిదండ్రుల స్వస్థలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలోని భీమనపల్లి శివారు భట్టుపాలెం. ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటూ, కుమార్తెకు చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సాహం అందించారు. శ్రీవైశాలికి చిన్నప్పటినుంచీ ఆటలంటే ఎంతో ఇష్టం. అథ్లెటిక్స్‌పై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అథ్లెటిక్స్‌తోపాటు లాన్ టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడేది. లాన్ టెన్నిస్‌తోపాటు సాఫ్ట్ టెన్నిస్‌లోనూ నైపుణ్యం సంపాదించింది. అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణిగా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించింది. ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో రెండు బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకం అందుకుంది. రాష్ట్ర స్థాయిలో 8 బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
శ్రీవైశాలి 2వ ఆసియన్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండివిడ్యువల్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ప్రతిష్ఠను పెంచింది. జాతీయ స్థాయిలో 20, 21, 22వ సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లకు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. 20వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచి మిక్సిడ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ అందుకుంది. 18, 19వ జూనియర్ జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లోనూ, 17, 18వ సబ్ జూనియర్ విభాగాల్లోనూ ప్రాతినిధ్యం వహించి మంచి ప్రతిభ కనబర్చింది. 19వ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఇండివిడ్యువల్ మిక్సిడ్ డబుల్స్‌లో సిల్వర్ మెడల్, మిక్సిడ్ టీం విభాగంలో బంగారు పతకం సాధించింది. అండర్-14 విభాగంలో 69వ జాతీయ స్కూల్ గేమ్స్-2025-26లో ఇండివిడ్యువల్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. 2023-24, 2024-25లో జరిగిన 67, 68వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించి మంచి ప్రతిభ కనబర్చింది. 2025-26లో జరిగిన అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీల్లో ఇండివిడ్యువల్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్, జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించింది.

రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు
వైశాలి ఏపీ సీనియర్ అంతర్‌జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్-2025-26లో వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. జూనియర్స్ నేషనల్‌లో 2025, 2026లో బంగారు పతకాలు, 2024లో నాలుగో స్థానం సాధించింది. ఏపీ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో 2023 నుంచి 2026 వరకు వ్యక్తిగత విభాగంలో వరుసగా బంగారు పతకాలు సాధించింది. అలాగే 67 నుంచి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా బంగారు పతకాలు అందుకుంది. 2025-26 సాఫ్ట్ టెన్నిస్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి రాష్ట్రానికి తొలి బంగారు పతకం అందించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం 2026-27లో జరగనున్న 23వ సీనియర్ జాతీయ, 21వ జూనియర్ జాతీయ, 20వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లతో పాటు 70వ జాతీయ స్కూల్ గేమ్స్‌కు సిద్ధమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే భారీ వ్యయం అవసరమవుతోంది. సాఫ్ట్ టెన్నిస్‌కు ప్రభుత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తే మరింత నాణ్యమైన కోచింగ్ తీసుకుని మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తానని చెబుతోంది. అన్నివేళలా సహకరిస్తూ, ప్రాక్టీస్ క్యాంపులు నిర్వహిస్తూ క్రీడాకారులను ఉత్తేజపరుస్తున్న ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

 

దేశానికి మంచిపేరు తెస్తా…

సాఫ్ట్ టెన్నిస్‌లో అన్ని మెళకువలు నేర్చుకున్నా. కోచ్‌ల వద్ద తీసుకున్న శిక్షణ పోటీల్లో రాణించేలా దోహదపడుతోంది. రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా క్రీడల్లో రాణించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఏపీ స్టేట్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆసియా, ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి దేశానికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యం. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

– శ్రీ వైశాలి, సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి


– యడవల్లి శ్రీనివాసరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్