- తుది ఒప్పందం తర్వాతే అనుమతి: ఇరాన్ స్పష్టీకరణ
టోక్యో: ఇరాన్ అణు కేంద్రాల తనిఖీల అంశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) మరియు ఇరాన్ ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం అణు కేంద్రాల్లో తనిఖీలు త్వరలో ప్రారంభమవుతాయని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రోస్సీ వెల్లడించగా, తుది ఒప్పందం కుదరకుండా ఎలాంటి తనిఖీలకూ అనుమతి ఇవ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. జపాన్‌లోని ఫుకుషిమా డైచి అణు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన మీడియా సమావేశంలో గ్రోస్సీ మాట్లాడుతూ, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనలో భాగంగా అణు కేంద్రాల తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.
అయితే ఈ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ, సమగ్ర మరియు తుది ఒప్పందం కుదిరిన తర్వాతే తనిఖీల అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖాసెమ్ గరీబాబాది మాట్లాడుతూ, ఇటీవల దాడులకు గురైన అణు స్థావరాల్లోకి ప్రస్తుతం ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, అణు కేంద్రాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని అంశాలపై తుది అంగీకారం వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని గరీబాబాది పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)