- చెక్ రిపబ్లిక్‌పై 3-0 విజయం
- అగ్రస్థానంలో ఆతిథ్య జట్టు
మెక్సికో సిటీ : ప్రపంచకప్ ఆతిథ్య జట్టు మెక్సికో జట్టు తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. గురువారం గ్రూప్-ఎలో జరిగిన చివరి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను 3-0 గోల్స్ తేడాతో ఓడించిన మెక్సికో, మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు చెక్ రిపబ్లిక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకున్న మెక్సికో ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగింది. అయితే చెక్ రిపబ్లిక్ రక్షణాత్మక ఆటతో తొలి అర్ధభాగంలో మెక్సికోను నిలువరించగలిగింది. దీంతో మొదటి 45 నిమిషాలు గోల్స్ లేకుండానే ముగిశాయి.
రెండో అర్ధభాగంలో మెక్సికో దూకుడు పెంచింది. 55వ నిమిషంలో మాటియో చావెజ్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. మ్యాచ్ ముగియడానికి ఐదు నిమిషాల ముందు జూలియన్ క్వినోన్స్ రెండో గోల్ సాధించి మెక్సికో విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. ఇంజూరీ టైమ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడు అల్వారో ఫిడాల్గో మరో గోల్ చేయడంతో స్కోరు 3-0గా మారింది. ఈ ఓటమితో చెక్ రిపబ్లిక్ గ్రూప్-ఎలో ఒక డ్రా, రెండు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు దక్షిణాఫ్రికాపై 2-0, దక్షిణ కొరియాపై 1-0 విజయాల అనంతరం చెక్ రిపబ్లిక్‌పైనా గెలిచిన మెక్సికో నాకౌట్ పోరుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.









కామెంట్‌లు (0)