mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణ సున్నిత ప్రాంతాలపై కేంద్రం ఏకపక్ష నిర్ణయం!

4 గంటల క్రితం

esa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 07:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మళ్లీ కేరళలో ఆందోళన

- జనావాసాలకు మినహాయింపు లేనట్లే!

న్యూఢిల్లీ: పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాల (ఈఎస్ఏ) నిర్ధారణకు సంబంధించిన కస్తూరిరంగన్ నివేదిక అమలుపై కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో కేరళలో మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లోని 31 గ్రామాలను పర్యావరణ సున్నిత ప్రాంతాల పరిధి నుంచి మినహాయించాలని కేరళ చేసిన విజ్ఞప్తిని కేంద్ర నిపుణుల కమిటీ తిరస్కరించినట్లు సమాచారం.

జనావాసాలు, వ్యవసాయ భూములు, తోటల ప్రాంతాలను మినహాయించి కేవలం అటవీ ప్రాంతాలనే ఈఎస్ఏలుగా గుర్తించాలని కేరళ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపాదిత 9,993 చ.కి.మీ. ఈఎస్ఏ విస్తీర్ణాన్ని వెయ్యి చ.కి.మీ.కు పైగా తగ్గించాలని కూడా కోరింది. అయితే, కేరళలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించకుండానే కేంద్ర నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కస్తూరిరంగన్ నేతృత్వంలోని కమిటీ కేరళం, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని 56,825 చ.కి.మీ. ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతాలుగా గుర్తించాలని 2013లోనే సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, రాష్ట్రాల అభ్యంతరాల కారణంగా 2022 వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. అనంతరం ఆరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే కేరళ, కర్ణాటక రాష్ట్రాల అభ్యంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం కస్తూరిరంగన్ నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల అంశాలను మినహాయించి కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. పశ్చిమ కనుమల పరిరక్షణ పేరుతో జనావాసాలను ఈఎస్ఏ పరిధిలోకి తీసుకురావడం ఆమోదయోగ్యం కాదంటూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్