శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి ‌హాకీ ప్రపంచకప్‌ ‌

1 గంట క్రితం

odisa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తొలి మ్యాచ్‌‌లో వేల్స్‌‌తో భారత్‌ ఢీ

- సాయంత్రం 4.30గంటల నుంచి

బ్రూసెల్స్‌(బెల్జియం): బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికలుగా నేటినుంచి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌(ఎఫ్‌ఐహెచ్‌) హాకీ ప్రపంచకప్‌-2026 టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు 50ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 1975లో చివరిసారిగా స్వర్ణం సాధించింది. ఆ తర్వాత పతకం లభించిన దాఖలాలే లేవు. ఈసారి ఎలాగైనా ఆ లోటును భర్తీ చేయాలనే లక్ష్యంతో టీమిడియా బరిలోకి దిగుతోంది. తనకు ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చని సీనియర్ మిడ్‌ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌ ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా పతకం కొట్టాలనే దృక్పథంతో బరిలోకి దిగుతున్నారు. హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ సారథ్యంలోని భారత హాకీజట్టు ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తోంది. పూల్‌-‌డిలో ఉన్న భారతజట్టు శనివారం జరిగే తొలి మ్యాచ్‌‌లో వేల్స్‌‌తో తలపడనుంది. 17న ఇంగ్లాండ్‌, 19న పాకిస్తాన్‌‌తో పూల్‌ ‌లీగ్‌ ‌మ్యాచ్‌‌లు ఆడనుంది. పూల్‌ దశలో భారత్.. ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందించిన హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ పర్యవేక్షణలోనే భారత్‌ ఈ టోర్నీ ఆడుతోంది. పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్ ఏకకాలంలో ఒకే వేదికపై జరగడం ఇదే తొలిసారి. హాకీ ఆసియా కప్ 2025ను గెలుచుకోవడం ద్వారా భారత్.. మెగా టోర్నీకి అర్హత సాధించింది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్‌తో సహా మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఆగస్ట్ 30న జరిగే ఫైనల్‌‌తో టోర్నీ ముగియనుంది.

ఇదే నా చివరి ప్రపంచ కప్‌: మన్‌ప్రీత్ సింగ్‌

‘‘ఈ వరల్డ్ కప్‌ నాకెంతో స్పెషల్. ఇది నాకు నాలుగో ఎడిషన్. మేం ఒలింపిక్‌ మెడల్స్‌ గెలిచాం. కానీ, వరల్డ్‌ కప్‌లో పతకం అందుకోలేకపోయాం. ఇప్పుడున్న జట్టులో ప్రతి ఒక్కరి కల కూడా అదే. నావరకైతే ఇదే చివరి ప్రపంచ కప్‌ కావొచ్చు. అదే మైండ్‌సెట్‌తో బరిలోకి దిగుతా. ఇప్పటి వరకు మేం సాధించలేకపోయిన దానిని అందుకొనేందుకు ప్రయత్నిస్తాం. క్రమశిక్షణతో ఆడతాం. అప్పుడే గెలిచే అవకాశాలు మనకు మెరుగ్గా ఉంటాయి. జట్టులో ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభవం ఉంది. ప్రతి ట్రైనింగ్‌ సెషన్‌లోనూ మేం వందశాతం కష్టపడ్డాం. జట్టులోని ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలనే లక్ష్యంతోనే ఉన్నారు. ఫిట్‌నెస్‌పై మా కోచ్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే.. ఫిట్‌గా ఉంటే అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేం దుకు ఆస్కారం ఎక్కువ. గోల్స్‌ కొట్టడం మీదనే కాకుండా.. డిఫెన్స్‌పైనా వర్కౌట్ చేశాం. ప్రత్యర్థి పాకిస్థానా? ఇతర జట్టా? అనేది ముఖ్యం కాదు. మా ప్రణాళిక ప్రకారం ఆడతాం. గెలిచి తీరుతాం’’ అని మన్‌ప్రీత్ సింగ్‌ వెల్లడించాడు.

గ్రూప్‌ దశలో జట్లు ఉన్న పూల్స్‌...

పురుషులు...

పూల్‌-ఎ: అర్జెంటీనా, జపాన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌

పూల్‌-బి : బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, మలేషియా

పూల్‌-సి : ఆస్ర్టేలియా, స్పెయిన్‌, ఐర్లాండ్‌, దక్ష‍ిణాఫ్రికా

పూల్‌-డి : ఇండియా, ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌, వేల్స్‌

మహిళలు...

పూల్‌-ఎ: ఆస్ర్టేలియా, చిలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌

పూల్‌-బి : అర్జెంటీనా, జర్మనీ, స్కాట్లాండ్‌, అమెరికా

పూల్‌-సి : బెల్జియం, స్పెయిన్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌

పూల్‌-డి : ఇండియా, ఇంగ్లాండ్‌, చైనా, దక్ష‍ిణాఫ్రికా.

​నేటి మ్యాచ్‌‌లు...

‌మహిళలు...

ఆస్ర్టేలియా - జపాన్‌‌(‌వాఘేనార్‌ ‌స్టేడియం; నెదర్లాండ్స్‌)

జర్మనీ - స్కాట్లాండ్‌(బెల్ఫూస్‌ ‌హాకీ ఎరేనా; బెల్జియం)

నెదర్లాండ్స్‌ - ‌చిలీ (‌వాఘేనార్‌ ‌స్టేడియం; నెదర్లాండ్స్‌)

అర్జెంటీనా - అమెరికా (బెల్ఫూస్‌ ‌హాకీ ఎరేనా; బెల్జియం)

పురుషులు...

ఇండియా - వేల్స్‌ (సా.4.30గం.లకు) (‌వాఘేనార్‌ ‌స్టేడియం; నెదర్లాండ్స్‌)

జర్మనీ - మలేషియా (రా.6.00గం.లకు) (బెల్ఫూస్‌ ‌హాకీ ఎరేనా; బెల్జియం)

ఇంగ్లండ్‌ - పాకిస్తాన్‌ (రా.7.30గం.లకు) (‌వాఘేనార్‌ ‌స్టేడియం; నెదర్లాండ్స్‌)

బెల్జియం - ఫ్రాన్స్‌ (రా.9.00గం.లకు) (బెల్ఫూస్‌ ‌హాకీ ఎరేనా; బెల్జియం)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్