- షూటింగ్‌లో రెండు రజతాలు సొంతం
- ఫైనల్‌కు చేరిన మహిళా క్రికెట్ జట్టు
- ఎంఎంఎలో పతకం ఖాయం
- హాకీలో గోల్స్ మోత
- ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల శుభారంభం
నాగోయా (జపాన్): ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ఆరంభాన్ని సాధించింది. షూటింగ్‌లో ఇలవేనిల్ వలరివన్ రెండు రజతాలతో పతకాల ఖాతా తెరవగా, ఎంఎంఏ లో సుచిక తరియాల్ సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖరారు చేసుకుంది. గత రెండు ఆసియాడ్‌లలో పతకం సాధించలేకపోయిన 27 ఏళ్ల ఇలవే నిల్ వలరివన్ ఈసారి డబుల్ మెడల్స్ తో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో 252.4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన హినాటా తైచి (253.0) ఆసియాడ్ రికార్డుతో స్వర్ణం నెగ్గగా, ఇలవేనిల్ కేవలం 0.6 పాయింట్ల తేడాతో పసిడి చేజార్చుకుంది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలోనూ భారత్ రజతం సాధించింది. వలరివన్, సోనమ్ ఉత్తమ్ మస్కార్, విదార్స వినోద్‌తో కూడిన భారత జట్టు మొత్తం 1898.0 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు 1904.2 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా, జపాన్ (1897.1) కాంస్యం గెలుచుకుంది.
షెఫాలీ వర్మ శతకం..
మహిళల టీ20 క్రికెట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్ చేరి స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. సెమీఫైనల్లో 114 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ( 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 నాటౌట్) కెరీర్‌లో తొలి టి20 అంతర్జాతీయ శతకాన్ని సాధించి విధ్వంసం సృష్టించింది. దాంతో తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. ఛేదనలో 15.4 ఓవర్లలో బంగ్లాదేశ్ 81 పరుగులకే కుప్పకూలింది. మంగళవారం జరిగే ఫైనల్లో పసిడి పతకం కోసం శ్రీలంకతో భారత్ తలపడనుంది.
సుచిక సంచలనం
ఆసియాడ్‌లో తొలిసాట్టు ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో భారత్‌కు చెందిన 36 ఏళ్ల సుచిక తరియాల్ పతకం ఖరారు చేసి సంచలనం సృష్టించింది. మహిళల ట్రెడిషనల్ 60కేజీల కేటగిరీ క్వార్టర్స్‌లో సుచిక 2-0తో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్ బైగల్మాను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. కాగా, టెక్ బాల్‌లో క్విమ్సి డిసౌజా నిరాశపరిచింది. మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ (మహమ్మద్ అనస్ బెగ్‌తో కలిసి) కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓడిపోయి పతకాన్ని కొద్దిలో చేజార్చుకుంది.
హాకీలో రికార్డు విజయాలు
కకామిగహరా వేదికగా జరిగిన తొలి పూల్ మ్యాచ్‌లలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ప్రత్యర్థులను చిత్తు చేశాయి. మహిళల జట్టు 19-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఊచకోత కోసింది. 22 ఏళ్ల స్ట్రైకర్, డ్రాగ్ ఫ్లికర్ దీపికా సెహ్రావత్ ఏకంగా 8 గోల్స్‌తో చెలరేగింది. పురుషుల జట్టు 13-1తో ఇండోనేషియాను ఓడించగా, దిల్‌ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించాడు. ఇక, బాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలతో కూడిన భారత జట్టు 3-0తో కజకిస్థాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో ఆతిథ్య జపాన్‌తో భారత్ తలపడనుంది.
అదరగొట్టిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరి ధాటికి కజకిస్థాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఇక మూడో సింగిల్స్‌తో డయానా నమేనోవాపై 21-5, 21-10 తేడాతో తన్వి శర్మ విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్‌య జపాన్ జట్టుతో మంగళవారం భారత బృందం తలపడనుంది.








కామెంట్‌లు (0)