శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కబడ్డీలో రెండు స్వర్ణ పతకాలు

22 నిమిషాల క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:33 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- అథ్లెటిక్స్‌లో మూడు, స్క్వాష్‌లో ఒకటి

- పతకాల పట్టికలో టాప్‌-10లోకి భారత్‌

​ఐచి-నగోయో(జపాన్‌): 20వ ఆసియా క్రీడల్లో ఏడోరోజు భారత్‌కు ఆరు పతకాలు దక్కాయి. కబడ్డీ పురుషుల, మహిళల విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు లభించగా.. అథ్లెటిక్స్‌ మరో మూడు పతకాలు దక్కాయి. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం గెలిచాడు. మహిళల 400మీ. ఫైనల్లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరీ కాంస్యం సాధించారు. ఇక స్వ్కాష్‌లో మ‌హిళ‌ల విభాగంలో అనాహ‌త్ ఫైనల్‌కు చేరగా.. మిక్స్‌డ్‌ విభాగంలో జోష్నా చిన్న‌ప్ప‌, విలావ‌న్ సెంథిల్ కుమార్‌ సెమీస్‌లో ఓటమిపాలై కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారు. ఇక అథ్లెటిక్స్‌ పురుషుల విభాగంలో అభ‌య్ సింగ్‌లు ఫైన‌ల్లో అడుగుపెట్టి ప‌త‌కం ఖాయం చేయగా.. హాకీలో పురుషుల, మహిళల విభాగాల్లో భారతజట్లు సెమీస్‌కు చేరాయి. దీంతో ఈ క్రీడల్లో భారత్‌కు ఇప్పటివరకు దక్కిన పతకాల సంఖ్య 30కు చేరగా.. టాప్‌-10కు ఎగబాకింది. ఇక గత ఆసియా క్రీడల్లో సెంచరీ మార్క్‌ను దాటిన భారత్ ఈసారి ఆ ఫీట్‌ను అందుకోవడం కష్టమే.

షాట్‌పుట్‌లో రజతం...

పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం గెలుచుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ తన ఐదో ప్రయత్నంలో షాట్‌పుట్‌ను 20.64 మీటర్ల దూరం విసిరి ఉత్తమ ప్రదర్శనతో రజతం ఖాయం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన మొహమ్మద్రెజా తయబైస్ 20.81మీ. దూరం విసిరి ఆసియా గేమ్స్‌ రికార్డును బ్రద్దలు కొట్టి పసిడి పతకాన్ని సాధించగా.. మహ్మద్‌ టోలూ(సౌదీ అరేబియా) 20.48మీ. కాంస్య పతకం సాధించాడు.

ప్రాచీకి కాంస్యం

మహిళల 400 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరీ కాంస్యం ఒడిసిపట్టింది. 400మీ. ఫైనల్ రేసులో ప్రాచీ 53.21 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌కు చెందిన సాల్వా నాస‌ర్ 49.20 సెక‌న్ల‌లో గ‌మ్యాన్ని చేరి స్వ‌ర్ణం గెలుచుకోగా, ఇరాన్‌కు చెందిన జ‌హ్రా జ‌రేయి 52.38సెకన్ల‌లో గ‌మ్యాన్ని చేరి ర‌జ‌తం సాధించింది. మ‌రో భార‌త అథ్లెట్ కిర‌ణ్ ప‌హాల్ 53.41 సెక‌న్ల‌లో గ‌మ్యాన్ని చేరి ఐదో స్థానానికి పరిమితమైంది.

స్క్వాష్ ఫైన‌ల్‌కు అనాహ‌త్

స్క్వాష్ క్రీడాకారిణి అనాహ‌త్ సింగ్‌.. త‌న కెరీర్‌లోనే అత్య‌ద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆసియా క్రీడల మ‌హిళ‌ల సింగిల్స్ ఈవెంట్‌లో ఆమె ఫైన‌ల్‌కు ప్ర‌వేశించింది. సెమీస్‌లో జ‌పాన్‌కు చెందిన స‌టోమి వాటాన‌బేపై 3-2 తేడాతో విజయం సాధించింది. 18 ఏళ్ల అనాహ‌త్ .. అసాధార‌ణ రీతిలో త‌న గేమ్‌ను ఆడింది. తొలుత రెండు సెట్ల‌ను కోల్పోయి 0-2తో వెనుక‌బ‌డింది. ఆ త‌ర్వాత అనూహ్యంగా పుంజుకొని ఏకంగా చివ‌రి మూడు సెట్ల‌లో విజ‌యం సాధించి.. ఫైనల్‌కు చేరి ప‌త‌కాన్ని ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో అనాహ‌త్ 9-11 11-13 12-10 11-6 11-3 స్కోరుతో స‌టోమిను చిత్తుచేసింది. ఇక భార‌త జోడి జోష్నా చిన్న‌ప్ప‌, విలావ‌న్ సెంథిల్ కుమార్‌.. కాంస్య పతకాన్ని సాధించారు. సెమీస్‌లో హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్‌, లీ కా యి చేతిలో 2-1 (11-10 2-11 11-10) తేడాతో ఓటమిపాలయ్యారు. పురుషుల క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ 28న తలపడనున్నాయి.


హాకీ సెమీస్‌కు భారతజట్లు

హాకీ సెమీఫైనల్లోకి భారతజట్లు ప్రవేశించాయి. శనివారం జరిగిన గ్రూప్‌-ఎ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను చిత్తుచేసి ఇరుజట్లు గ్రూప్‌ టాపర్‌గా ముగించాయి. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల హాకీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారతజట్టు 2-0తో జపాన్‌ను చిత్తుచేసింది. అభిషేక్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ ఒక్కో గోల్స్‌ చేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈ గూప్‌లో భారతజట్టు ఇండోనేషియాపై 13-1తో ఘనవిజయం సాధించడం ద్వారా ప్రారంభించింది, ఆ తర్వాత శ్రీలంకపై 16-1తో గెలుపొందింది. అనంతరం దక్షిణ కొరియాను 8-2తో ఓడించిన భారత్, తాజాగా జపాన్‌పై 2-0తో ముగించి గ్రూప్‌ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. గ్రూప్‌-బిలో 2వ స్థానంలో పాకిస్తాన్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఇక మహిళలజట్టు గ్రూప్‌-బిలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో జపాన్‌ను ఓడించింది. లాల్‌రిమిసిమి(5వ ని.), ఇషికా చౌదరి(30వ ని.), నవ్‌నీత్‌ కౌర్‌(36వ ని.)ఒక్కో గోల్స్‌ చేయగా.. జపాన్‌ తరఫున ఏకైక గోల్‌ను షీహో కొబయకవా(46వ ని.) చేసింది. ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో సింగపూర్‌తో తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్