- నిందితులను వెంటనే శిక్షించాలి : కెవిపిఎస్ డిమాండ్
ప్రజాశక్తి - పెదకాకాని (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో దళిత యువకుడు బండికళ్ల రవి (48) అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం, కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు తదితరులు శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయన్నారు. దొంగతనం నెపంతో రవిని పెత్తందారులు అతి దారుణంగా కొట్టడం వల్లే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. తాడికొండ పోలీస్ స్టేషన్లో దళిత యువకుడిని హింసించి ఆయన చావుకు కారణమైన ఘటన మరువక ముందే నంబూరులో ఈ ఘాతుకానికి పాల్పడిన పెత్తందార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలిలో యువకులపై పోలీసులు విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినా... కోర్టు కేసు కొట్టి వేయడం బాధాకరమన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు ప్రభుత్వాలు, పోలీసులు అమలు జరపకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులపై ఇన్ని అఘాయిత్యలు జరుగుతుంటే రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని విమర్శించారు. పాశం రామారావు మాట్లాడుతూ మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ, నంబూరు గ్రామ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, కె.ఆదాం తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)