- రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రామారావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడే వైసిపి నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. 59 మంది పోలీసు అధికారులపై ఎస్ఈసికి ఫిర్యాదు చేశామని, ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని కోరినట్లు తెలిపారు. వైసిపి అభ్యర్థులపై వందల సంఖ్యలో కేసులు పెట్టారని, ఎవరిపై, ఎప్పుడు, ఎక్కడ కేసులు పెట్టారో తెలియదంటున్నారని, కేసులు లేవన్న సర్టిఫికెట్ అడిగినా ఇవ్వడం లేదని విమర్శించారు. నామినేషన్‌కు పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఎస్ఈసి జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారని, ఈ విషయంపై కింది స్థాయి అధికారులకు సర్క్యులర్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు ఆదేశించినా జూలై 15 వరకు ఓటర్ల జాబితా ఇవ్వలేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, కుప్పంలో వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారని తెలిపారు. మంగళగిరిలో దాసరి వీరయ్యను పిడి యాక్ట్‌తో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారని పేర్కొన్నారు. దుగ్గిరాలలో వైఎస్సార్‌సిపి గెలుస్తుందనే భయంతోనే ఈ చర్యలకు దిగారని అన్నారు. దళిత నాయకుడు వీరయ్యను ఎన్నికలకు దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం మూర్ఖత్వమని, అభ్యర్థులపై కేసులు, పోలీసుల అక్రమాలపై ఎస్ఈసి తక్షణమే చర్యలు తీసుకుని న్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. టిజెఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ దసరా పండుగ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎస్ఈసి కార్యాలయం చుట్టూ తిరిగే దుస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేశారు. ఐదుసార్లు సర్పంచ్‌గా, ఎంపిటిసిగా, జెడ్‌పిటిసిగా ప్రజలకు సేవ చేసిన కుటుంబానికి చెందిన దాసరి వీరయ్యపై పిడి యాక్ట్ పెట్టడం దారుణమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో గెలవాలే తప్ప అరెస్టులతో కాదని అన్నారు.







కామెంట్‌లు (0)