- కేంద్ర మంత్రి చౌహన్‌కు సిఎం చంద్రబాబు విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రైతులకు మేలు చేకూర్చేందుకు, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన రెండు వేర్వేరు లేఖల్లో కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ పక్కా ఇల్లు కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలనే అంశాలను ఆయన దృష్టికి సిఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి పిఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి పంటల అంచనా దిగుబడిని వంద శాతం ఎపి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు ఆధారంగా చేసిన మార్పులను ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో చేయాలన్నారు. దీనివల్ల ప్రస్తుత రబీ సీజన్ నాటికి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయొచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఆర్‌కెవివై కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి ఆమోదించిన రూ.52.16 కోట్ల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. అలాగే 5.69 లక్షల మట్టి నమూనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.10.24 కోట్ల కమిటెడ్ లయబిలిటీ నిధులను, 2026-27కు రావాల్సిన మిగులు కేటాయింపులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)