గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ప్రకాశం’లో ‘ఇరుముడి’ తరహా ఘటన­

45 నిమిషాల క్రితం

‘ప్రకాశం’లో ‘ఇరుముడి’ తరహా ఘటన
­ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 07:14 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి ఇద్దరు హాస్టల్ విద్యార్థినులను పంపిన వంట మనిషి

- బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

- చర్యలకు ఉపక్రమించిన అధికారులు

ప్రజాశక్తి- ఒంగోలు సిటీ, జరుగుమల్లి (ప్రకాశం జిల్లా): ఇరుముడి సినిమాలో పాఠశాలలో చదివే విద్యార్థినులను తనకు మేలు చేసిన ఓ ప్రజాప్రతినిధి వద్దకు ఉపాధ్యాయురాలు పంపుతుంది. ఇలాంటి తరహా ఘటనే ఒంగోలులో తీవ్ర కలకలం రేపింది. జరుగుమల్లి ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహం పదో తరగతి విద్యార్థిని, తొమ్మిదో తరగతి విద్యార్థిని సెప్టెంబరు 29న ఉదయం 11 గంటల సమయంలో ఒంగోలు గోపాల్‌నగర్‌లో ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి వెంకటరావు ఇంటికి వెళ్లారు. వంట మనిషి శారద సూచనతోనే వారిద్దరూ అక్కడికి వెళ్లినట్లు అధికారుల విచారణలో తేలింది. అక్కడ వెంకటరావు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలికలు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు స్నేహితులు. వారిలో ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు పదో తరగతి జరుగుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. జరుగుమల్లి బిసి హాస్టల్ లో ఉంటున్నారు. ఈ బాలికలు ఇద్దరూ మంగళవారం ఉదయం 11 గంటలకు జరుగుమల్లిలో ఆటో ఎక్కి ఒంగోలులోని గోపాల్ నగరం ప్రాంతంలో ఉంటున్న డిఆర్‌‌డిఎలో పదవీ విరమణ చెందిన ఉద్యోగి వెంకటరావు ఇంటికి వెళ్లారు. బిసి హాస్టల్లో వంట చేస్తున్న శారదకు వెంకట్రావుతో పరిచయం ఉంది. ఈ బాలికలకు వెంకట్రావు సెల్ నెంబర్ ఇచ్చి ఆమె అక్కడికి పంపారు. వెంకట్రావు బాలికలు ఇద్దరికీ బిర్యానీ ఇచ్చారు. ఆ తర్వాత వారికి తన ఫోనులో నీలి చిత్రాలు చూపించారు. ఇదేదో ప్రమాదకరంగా ఉందని గమనించిన తొమ్మిదో తరగతి విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఒంగోలులోని పార్కులో తిరిగిన వారు ఇద్దరు సాయంత్రం మరలా వెంకట్రావు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో, వారు 112 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంకట్రావుని అదుపులోకి తీసుకొని ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి పోక్సో కేసు నమోదు చేశారు.

అధికారుల విచారణ..

ఈ ఘటన నేపథ్యంలో బిసి వెల్ఫేర్ అధికారి ఎస్.నిర్మల జ్యోతి, జరుగుమల్లి తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు బిసి హాస్టల్ లో విచారణ చేపట్టారు. వంట మనిషి శారదను బాధ్యతల నుండి తొలగించారు. హాస్టల్ వార్డెన్ తెరెజమ్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అంతర్గత కమిటీ వేసి ఈ విషయంపై విచారణ చేయనున్నట్లు నిర్మల జ్యోతి తెలిపారు. శారదను, తెరేజమ్మను విచారణ నిమిత్తం జరుగుమల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్ ఒంగోలుకు తరలించారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్