- వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టిడిపి గూండాలు అడ్డుకుంటున్నారని వైసిపి స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంటిపై దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని, లేదంటే కేసులు పెడుతున్నారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల అండతో వైసిపి అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. వైసిపి అభ్యర్థులపై కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆహ్వానిస్తున్నామని, వాటిని ఎస్‌ఈసి పాటిస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా లెక్క చేయడం లేదని, టిడిపి గూండాలకు పోలీసులు వంత పాడుతున్నారని పేర్కొన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, మొత్తం 11 జిల్లాల్లో 76 ఘటనలు జరిగాయని వివరించారు. దాడులు చేస్తూ నామినేషన్ పేపర్లు లాక్కుంటున్నారని, ఓటమి భయంలో టిడిపి వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ డైరక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని పేర్కొన్నారు. తమ వైపు నుండి ఎక్కడా దాడులు లేవని అన్నారు. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి కారుపై దాడి చేశారని, సీనియర్ దళిత నాయకుడిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుగ్గిరాల మండల నాయకుడిపై పిడి యాక్టు పెట్టారని అన్నారు. దాడులు చేస్తున్న వారికి పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని సజ్జల విమర్శించారు.







కామెంట్‌లు (0)