- అత్యుత్సాహం కనబరిచిన పోలీసులకు బిగ్ షాక్
ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు జిల్లా) : కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటనలో నమోదైన హత్యాయత్నం కేసును కోర్టు కొట్టు వేసింది. ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులకు కోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. కేసు వివరాలను పరిశీలిస్తే గత ఏడాది ఏప్రిల్ 24న పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె చిరంజీవి బైక్పై రాత్రి వేళ వెళుతుండగా ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొందరు యువకులు అటకాయించారు. కానిస్టేబుల్ కు యువకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తనపై కత్తితో దాడి చేశారని కానిస్టేబుల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు రౌడీ షీటర్ వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబూలాల్ అలియాస్ కరిముల్లా, దోమ రాకేష్ ను నిందితులుగా చూపి అరెస్టు చేశారు. సాక్షాత్తు అప్పటి ఎస్పీ తెనాలి వచ్చి ఘటనపై ఆరా తీశారు కూడా. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అరెస్ట్ సమయంలో నిందితులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అప్పటి టూ టౌన్ సీఐ రాముల నాయక్, త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సిబ్బందితో కలిసి నడిరోడ్డుపై లాఠీలతో నిందితులపై విరుచుపడ్డారు. నిందితులను రోడ్డుపై కూర్చోబెట్టి వారి కాళ్లపై ఒక సీఐ నుంచుంటే మరో సీఐ వారి అరికాళ్ళపై కొట్టారు. పోలీసుల అత్యుత్సాహం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు సిపిఎం, ఏపీ రైతు సంఘం, కెఎన్పిఎస్, కెవిపిఎస్, పలు ప్రజా సంఘాలు పోలీసు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. జగన్ తెనాలి వచ్చి బాధితుల కుటుంబాలను పరామర్శించారు కూడా. ఈ కేసు తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణకు రాగా సాక్షాధారాలు లేని కారణంగా న్యాయమూర్తి డి శ్రీనివాసులు కేసును కొట్టివేశారు.








కామెంట్‌లు (0)