- బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: హక్కులను కాపాడుకునేందుకు బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆర్ అజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 29,29,30 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజయ్‌కుమార్ ప్రజాశక్తితో మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఉద్యోగుల పని - జీవన సమతుల్యత కోసం వారానికి 5 రోజుల పని విధానం కావాలని డిమాండ్ పెరిగిందన్నారు. సుదీర్ఘ ఐక్య పోరాటాల ఫలితంగా 2, 4వ శనివారాలు సెలవు దినాలుగా, మిగిలిన శనివారాలు పూర్తి రోజులుగా పనిచేసేటట్లుగా 2015లో ఒప్పందం జరిగిందన్నారు. 2024 మార్చి 8న జరిగిన వేతన ఒప్పందంలో భాగంగా 5 రోజుల పని విధానాన్ని అమలు జరపడానికి యాజమాన్యం అంగీకరం తెలిపిందన్నారు. 180 రోజుల లోపల అమలు జరుపుతామని ఒప్పందంలో రాశారని, 30 నెలలు పూర్తయినా నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ ఒప్పందం అమలు కోరుతూ జనవరి 27న పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మె చేసినా ప్రభుత్వంలో, యాజమాన్యంలో చలనం లేదన్నారు. ద్వైపాక్షిక ఒప్పందంలో పింఛను మెరుగుదల, నూతన పింఛను విధానాన్ని రద్దుచేసి అందరికీ పాత పింఛను విధానాన్ని అమలు చేయడం, అన్ని స్థాయిలలో తగినంత ఉద్యోగ నియామకాలు, సెలవు బ్యాంకు ఇతర అంశాలు ఈరోజుకి యాజమాన్యం చర్చించి పరిష్కరించలేదన్నారు.
కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు కింద మార్చి ఉద్యోగ, శ్రామిక ప్రజా వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టారని చెప్పారు. వీటివల్ల శాశ్వత ఉద్యోగాల కల్పనకు స్వస్తి చెప్పి తాత్కాలిక, పొరుగు సేవల విధానాన్ని మరింతగా పెంచేందుకు ఇవి దోహదపడ్డాయని తెలిపారు. పని గంటలు పెంచుకునే స్వేచ్ఛ యజమానులకు అనుకూలంగా ఈ నియమావళుల ద్వారా చేకూరిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో దీని ప్రభావంతో అన్ని బ్యాంకుల్లో తగినంత ఉద్యోగ నియామకాలు జరగడం లేదన్నారు.
ముంచుకొస్తున్న ప్రైవేటీకరణ ముప్పు
వికసిత్ భారత్-2047 ప్రాజెక్టులో బ్యాంకులు ఎలా ఉండాలో నిర్ధారించడానికి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు ప్రతిపాదన, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యనిర్వాహకులు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లను ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకోవడం, బ్యాంకుల మూలధనంలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించాలనే ప్రకటనలను ఆందోళనకరమన్నారు. పెట్టుబడి, నాయకత్వం ప్రైవేటుపరమయ్యాక నిజంగా బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులుగా పనిచేస్తాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలుగా ఇవ్వాల్సిన 14 లక్షల కోట్లు ఎన్‌బిఎఫ్‌సిలకు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేశాయని తెలిపారు. ఈ సొమ్మును ఎన్‌బిఎఫ్‌సిలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు సామాన్య ప్రజలకు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేల కోట్ల లాభాలు దండుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)