- ఆందోళనలో దళితులు
- కెవిపిఎస్ ఖండన
ప్రజాశక్తి - పంగులూరు (ప్రకాశం జిల్లా) : పంగులూరు మండలంలోని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన దళితులు 42 రోజుల పాటు పోరాడి సాధించుకున్న ఆర్చి నిర్మాణ హక్కును కాలరాసేందుకు ఆ గ్రామ పెత్తందారులు పూనుకున్నారు. నూజిళ్లపల్లి గ్రామ దళిత వాడ ఒంగోలు రోడ్డుకు దూరంగా ఉండటంతో, వారి అడ్రస్ తెలుసుకునేందుకు వీలుగా కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభంలో ‘అంబేద్కర్ నగర్’ పేరుతో ఆర్చి నిర్మాణం చేపట్టాలని దళిత కాలనీవాసులు వారి సొంత డబ్బులతో ఆర్చి నిర్మాణాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కలెక్టర్ అనుమతితోనే దళితులు కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభం దగ్గర ఆర్చి నిర్మాణానికి నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. అది సహించలేని పెత్తందారులు ఆ ఆర్చి నిర్మాణానికి ముందు రెండు అడుగుల దూరంలో మరో ఆర్చి నిర్మించేందుకు ఆదివారం పొక్లెయిన్‌తో గుంతలు తీయించారు. దీంతో, కెవిపిఎస్ నాయకులు రేణింగవరం డిఎస్‌పి మురళీకృష్ణను కలిసి మాట్లాడారు. పెత్తందారులు చేపట్టిన నిర్మాణాన్ని ఆపాలని, దళితులకు సహకరించాలని కోరారు. పరిశీలిస్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌పిని కలిసి మాట్లాడతామని కెవిపిఎస్ నాయకులు తెలిపారు.
పెత్తందారుల చర్య వ్యతిరేకించండి
జిల్లా కలెక్టర్, అధికారుల అనుమతితోనే దళితులు ఆర్చి నిర్మాణాన్ని చేపట్టినా, ఓర్చుకోలేని పెత్తందారులు మరో ఆర్చి నిర్మాణానికి ప్రయత్నించడం అన్యాయం. జిల్లా అధికారుల అనుమతి లేదనే కారణంతో దళితులను నిలువరించిన అధికారులు ఇప్పుడు పెత్తందారుల విషయంలో ఏం చేస్తారు? అధికారులు కల్పించుకుని ఆ ఆర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలి
- బి.రఘురాం, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి
పెత్తందారుల ఆర్చి నిర్మాణం అన్యాయం
పెత్తందారులు ఆర్చి నిర్మాణానికి దిగడం అన్యాయం. వాళ్లు నిర్మించే ఆర్చి ఆర్ అండ్ బి రోడ్డు దగ్గర ఉంది. పైగా అక్కడ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. అధికారులు ఈ చర్యను అడ్డుకోవాలి
- సిపిఎం మండల కార్యదర్శి తలపనేని రామారావు








కామెంట్‌లు (0)