- స్థానిక సంస్థల ప్రచారం కోసమే 'పేదలకు పట్టాభిషేకం'
- మున్సిపల్ ఎన్నికల ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : కూటమి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప పేదలకు ఒరిగింది ఏమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు విమర్శించారు. విజయవాడ శ్రీ శ్రీ భవన్ లో గురువారం జరిగిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విజయవాడలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమం కొద్దిమందికి ప్రయోజనం కలిగించినా, అత్యధిక మంది నిరుపేదలకు తీవ్ర నిరాశనే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంపూర్ణ హక్కుల పట్టాలంటూ ఊదరగొడుతున్నా, పేదల చేతిలో పెట్టినవి కేవలం 'మీరు పట్టాలు పొందటానికి అర్హులు' అని తెలిపే వట్టి సమాచార పత్రాలు మాత్రమేనని తెలిపారు. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం కాగితాలు ఇచ్చి పేదలను మోసం చేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 26,401 మంది లబ్ధిదారులలో కేవలం 2,586 మంది మాత్రమే కొత్తగా అర్హత సాధించారని, మిగిలిన 91 శాతం మంది గత 40-50 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల కాలంలో ఇచ్చిన కాగితాలు ఉన్నవారేనని గుర్తుచేశారు. గత 50 ఏళ్లలో దాదాపు 22 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇన్నేళ్లపాటు పేదలకు పూర్తి హక్కులు కల్పించకుండా ఎందుకు కాలయాపన చేసిందో సమాధానం చెప్పాలన్నారు. సిపిఎం నిర్వహించిన సర్వే ప్రకారం విజయవాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని దాదాపు 50 కాలనీలలో ఎవ్వరికీ ఈ జాబితాలో పేరు రాలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కృష్ణా కరకట్ట, కాల్వ కట్టలు, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే స్థలాల్లో దశాబ్దాలుగా ఉంటున్న నాలుగింట మూడు వంతుల మంది పేదలకు కనీసం ఈ కాగితం కూడా దక్కలేదన్నారు. ఇచ్చిన పత్రాల్లో 'రెండేళ్ల తర్వాతే పూర్తి హక్కులు వస్తాయి' అని నిబంధన పెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నారు. వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండటంతో, కేవలం 'మేయర్, కార్పొరేటర్ పదవుల పట్టా' కోసమే అధికార పార్టీ ఈ సభను ఎన్నికల ప్రచార సభలా మార్చుకుందని మండిపడ్డారు. 'పేదలకు రూ. 52 వేల కోట్ల ఆస్తి ఇచ్చాం' అని సిఎం చెప్తున్నప్పుడు, అదే ఆస్తి ఆధారంగా ఇళ్లు కట్టుకోవడానికి బ్యాంకులతో తక్షణమే రుణాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదలు స్థలాలు అమ్ముకోవద్దని నీతులు చెప్పే సిఎం.. సింగ్ నగర్, జక్కంపూడి, కవేళా ప్రాంతాల్లో కట్టిన ఇళ్లను అధికార పార్టీ నేతలు అక్రమంగా అమ్ముకుంటూ, పంచుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లపై సిఎం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలు మంది ఇళ్ల పట్టాలు లేని పేదలు ఉంటే, కేవలం విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి కాగితాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే, మిగిలిన 19 లక్షల మంది నిరుపేదల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులను ఉద్దేశించి ‘రీల్స్ చేయండి’ అని కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలంతా తమ నిజమైన సమస్యలపై తిరుగు రీల్స్ చేసి సిఎం, ఎంపీ, ఎమ్మెల్యేలకు పంపాలని పిలుపునిచ్చారు. 'మాకు వట్టి కాగితం ఇచ్చారు.. రిజిస్ట్రేషన్ చేయండి', 'అద్దె ఇళ్లలో ఉంటున్న మాకు రెండు సెంట్ల స్థలం ఇవ్వండి', 'కట్టిన ఇళ్లపై రుణ సదుపాయం కల్పించండి' అని డిమాండ్ చేస్తూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిలదీయాలన్నారు. ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా, లబ్ధిదారులందరికీ మున్సిపల్ ఎన్నికల లోపే ఉచితంగా ఒరిజినల్ రిజిస్టర్డ్ పట్టాలు ఇవ్వాలని, ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు, సిపిఎం నగర సెంట్రల్ నియోజకవర్గ కార్యదర్శి బి.రమణారావు, తూర్పు కార్యదర్శి పి.కృష్ణ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)