శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు

31 ఆగస్టు, 2026

ys sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు దక్కించుకునేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల సూచించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో సోమవారం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్షించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా, అర్హత ఆధారంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జేడీ శీలం, మస్తాన్‌ వలి నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్న సమర్థులైన అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లోకి వచ్చే అర్హత కలిగిన నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వాన్ని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడకుండా అడ్డుకోవాలని, ఎన్నికలు సక్రమంగా జరిగేలా పార్టీ శ్రేణులు నిఘా ఉంచాలని ఆమె హితవు పలికారు. ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆమె సూచించారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు, పార్టీ జిల్లా ఇన్‌చార్జిల నియామకాలను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

అబద్దాలు వల్లే వేస్తున్న చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చంద్రబాబు చేసినా.. సింహభాగం పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని పిసిసి చీఫ్‌ వైఎస్ షర్మిల ‌పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చెబుతున్నవి కొండంత అబద్ధాలని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వెలిగొండకు వైఎస్సార్‌ వెలుగైతే.. చంద్రబాబు చీకటి అంటూ వ్యాఖ్యానించారు. 1996 మార్చి 5న చంద్రబాబు వేసింది కేవలం శిలాఫలకమేనని, అనుమతులు, నిధులు లేకుండా కమిటీలు, డీపీఆర్‌ల పేరుతో తొమ్మిదేళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు. వైఎస్సార్ 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను భారీ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి పనులను వేగవంతం చేశారని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే 82 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జంట సొరంగాలు, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యామ్‌లతో ప్రాజెక్టును భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారని చెప్పారు. 22 కిలోమీటర్ల మేర సొరంగాల నిర్మాణం అప్పుడే పూర్తయిందన్నారు.

జలయజ్ఞం కింద వెలిగొండకు సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి చేశారని తెలిపారు. గొట్టిపాడు, సుంకేసుల డ్యామ్‌ల నిర్మాణానికి భూసేకరణ, పరిహారం, పనులు కూడా వైఎస్సార్ హయాంలోనే జరిగాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్