- నివేదికలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాక చట్టపర చర్యలు
- గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్‌సి కమిషనర్ చైర్మన్ జవహర్
ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : చీకటి గోపి కుటుంబానికి ఎస్‌సి కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని గోపి కుటుంబాన్ని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగతో కలిసి జవహర్ మంగళవారం పరామర్శించారు. గోపి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం గోపి మృతికి కారణాలు, పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. నిజనిర్థారణ కమిటీ పరిశీలించిన పలు అంశాలను జవహర్‌కు మాదిగ లాయర్స్ అసోసియేషన్ అడ్వైజర్ సాయినాథ్ వివరించారు. అనంతరం మీడియాతో జవహర్ మాట్లాడుతూ ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్, ప్రభుత్వ శాఖల నుంచి నివేదికలు తీసుకున్నామని, న్యాయవాదుల కమిటీ నివేదికను కూడా పరిశీలించామని, వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సిఫార్సు చేస్తామని, గోపి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. కుటుంబ పరిస్థితిపై కలెక్టర్, ఎస్‌పిలతో ఇప్పటికే మాట్లాడామని, గోపి కుమార్తె చదువు బాధ్యతను కమిషన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, అవసరమైతే రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నవీన్‌ప్రకాష్, నాయకులు సిహెచ్ భాస్కరరావు, ఎంఆర్‌పిఎస్, దళిత సంఘాల నాయకులు, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, డిఎస్‌పిలు కె పూర్ణచంద్రరావు, మురళికృష్ణ, సిఐలు పి కృష్ణయ్య, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)