సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చీకటి గోపి మృతిపై సిట్‌‌కు ఎస్‌పి అంగీకారం

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మీడియాకు వెల్లడించిన మందకృష్ణ మాదిగ, మాల్యాద్రి

- డిఎస్‌‌పి పూర్ణచంద్రరావు అంతర్గత విచారణ?

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తాడికొండ మండలం పొన్నెకల్లు దళిత యువకుడు చీకటి గోపి మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని జిల్లా ఎస్‌‌పి వకుల్‌ ‌జిందాల్‌ ‌హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంఆర్‌‌పిఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కెవిపిఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు అండ్ర మాల్యాద్రి మీడియాకు తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌‌పిని మందకృష్ణ మాదిగ, మాల్యాద్రి కలసి చీకటిగోపి మృతిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు, నిజనిర్ధారణ కమిటీ సేకరించిన ఆధారాలను ఎస్‌‌పికి అందజేశామని తెలిపారు. గోపి మృతి ఘటనపై 32 మంది న్యాయవాదుల బృందం కూడా పరిశీలన జరిపిందన్నారు. ఎంఆర్‌‌పిఎస్‌ లీగల్‌ సెల్‌, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గోపిని తీసుకెళ్లిన ఆసుపత్రి, పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించామని, సిఐ ఉమేష్‌తో మాట్లాడామని తెలిపారు. పోలీసుల దాడి కారణంగా గోపి మృతి చెందలేదని రిపోర్టును మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. తమ పరిశీలనలో ఇది సహజ మరణం కాదని, లాకప్‌ డెత్‌గా నిర్ధారించామని తెలిపారు. విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె) పార్టీ రాష్ర్ట అధ్యక్షులు విద్యాసాగర్‌, దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్‌) అధ్యక్షులు కొరివి వినయ్‌‌కుమార్‌, కెవిపిఎస్‌ ‌జిల్లా కార్యదర్శి నవీన్‌ ‌ప్రకాష్‌, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇలా ఉండగా పోలీసులపై తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్‌పి ఆదివారం రాత్రి గుంటూరు సౌత్‌ ‌డిఎస్‌‌పి పూర్ణచంద్రరావును విచారణ అధికారిగా నియమించారు. దీంతో ఆయన సోమవారం తాడికొండ వెళ్లి విచారణ చేపట్టారు. కేవలం చోరీ కేసులో నిందితులను పట్టుకుని వచ్చారా?ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా డిఎస్‌పి విచారణ చేపట్టారు. తాను త్వరలో ఎస్‌‌పికి నివేదిక ఇస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్