శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులకు కౌలు సొమ్ము తిరిగివ్వాలి

4 గంటల క్రితం

koulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్‌

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరువు మండలాల్లో ముందుగానే కౌలు చెల్లించిన కౌలు రైతులకు భూ యజమానుల నుంచి ఆ సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు తీవ్ర ప్రభావం చూపడంతో అత్యధికంగా నష్టపోయేది కౌలు రైతులేనని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో పెట్టుబడి భారం పెరగడంతో కౌలు చెల్లించి పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో 550 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని కోరారు. ప్రభుత్వం 388 మండలాలను కరువు, 283 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు తగిన ప్రయోజనం కలగడం లేదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్‌‌టిఆర్‌, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. పంట వేయని రైతులకు ఎకరాకు రూ.15 వేలు, పంట వేసి నష్టపోయిన వారికి ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత అప్పులను రద్దు చేసి కొత్త రుణాలు, పశువులకు ఉచితంగా మేత, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, పంట రుణాలు అందించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్