గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రైమ్‌ కంట్రోల్‌‌కు ‘త్రిశూల్’

11 సెప్టెంబర్, 2026

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- డ్రగ్స్‌, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడే లక్ష్యం

- జిల్లాల వారీగా కమిటీలు.. సమన్వయంతో కార్యాచరణ

- రోడ్డు ప్రమాదాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్

- సిఎం చంద్రబాబు

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి,, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘త్రిశూల్‌’ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఎనిమిదో జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌కు సంబంధించి ‘జీరో డ్రగ్స్‌’, మహిళల భద్రతకు ‘జీరో టాలరెన్స్‌ ఆన్‌ విమెన్‌’, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘జీరో రోడ్‌ యాక్సిడెంట్స్‌’ లక్ష్యంగా త్రిశూల్‌ కమిటీ పనిచేయాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ మూడు అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో డీ-అడిక్షన్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, అభ్యంతరకరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా వ్యవస్థీకృతంగా జరుగుతున్న వేధింపులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్‌ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని చెప్పారు. సైబర్‌ టెక్నాలజీలో నిపుణులను సిఐడిలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న 30 మంది కానిస్టేబుళ్లను జిల్లాలకు కేటాయించినట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తే ఫలితాలు కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో నేరాలు 14 శాతం తగ్గినట్లు తెలిపారు. ఆర్థిక నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని, అయితే కొన్ని జిల్లాల్లో ఆర్థిక నేరాలు ఎందుకు పెరిగాయో విశ్లేషించుకోవాలని సూచించారు. ఎస్ సి ఎస్ టి అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే నేరాలు 29.2 శాతం తగ్గాయని వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు విషయంలో రెండేళ్లలో 3 శాతం వృద్ధి నమోదైందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ప్రమాదాన్ని ఆడిట్‌ చేసి, ప్రమాదానికి దారితీసిన కారణాలను వెలికితీయాలని సూచించారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ ఎంత సమయంలో చేరుకుంటోంది, ప్రమాదాలకు ప్రధాన కారణాలేమిటనే అంశాలను విశ్లేషించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై వివిధ శాఖలు సమన్వయంతో జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసులు 30 నిమిషాల్లోపే చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. నేరం జరిగిన ప్రాంతానికి ఎంత త్వరగా చేరుకుంటే అంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 30 మంది పోలీసులతో జిల్లా యాక్షన్‌ అండ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజిపి కార్యాలయంలో సెంట్రల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కన్విక్షన్‌ రేటు 47 శాతంగా ఉందని తెలిపారు. నేరాలకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరించగలిగితే కన్విక్షన్‌ రేటును మరింత పెంచవచ్చన్నారు. కీలక కేసుల్లో డిఎన్ఎ పరీక్షల ఫలితాలకు ప్రస్తుతం పడుతున్న ఆరు గంటల సమయాన్ని మరింత తగ్గించాలని ఆదేశించారు. కోర్టు కేసుల పరిష్కారానికి ‘వన్‌ కోర్టు, వన్‌ కానిస్టేబుల్‌’ విధానం ఉండాలని సూచించారు. ప్రాంతీయ స్థాయిలో ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని, డాగ్‌ స్క్వాడ్‌లను కూడా నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని సిఎం సూచించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్