- సిపిఎం ఆధ్వర్యంలో ఎంటిఎంసి కార్యాలయం ముట్టడి
- పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత - కమిషనర్ హామీతో విరమణ
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటిఎంసి) కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు ముట్టడించారు. తొలుత పేదలు తమ దరఖాస్తులు సమర్పించడానికి కార్యాలయ గేటు వైపు వెళ్తుండగా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. దీంతో పేదలు, నాయకులు లోపలికి వెళ్లేందుకు గేటును నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులు వారిని నిలువరించి మళ్లీ గేట్లు వేయడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు అరగంటపాటు పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కమిషనర్ ఆలింబాష వచ్చి వినతిపత్రాన్ని తీసుకున్నారు. నెలరోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంతకు ముందు సిపిఎం పట్టణ కార్యదర్శి వివి.జవహర్లాల్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ... బడా కార్పొరేట్లకు ఎకరం 99 పైసలకే భూమిలిస్తామని ప్రేమను చూపుతున్న లోకేష్కు పేదల గురించి మాట్లాడే తీరిక లేదా? అని ప్రశ్నించారు. రోజుకో పండుగ పేరుతో సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేష్ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని విమర్శించారు. ఏడాదిగా పేదలు దరఖాస్తులు ఇస్తున్నప్పటికీ వాటిపై విచారణ చేయలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు - మన లోకేష్’ అంటూ ఐదు వేల మందికి పట్టాలిచ్చారని, వాటికి బ్యాంకుల ద్వారా రుణాలిచ్చే చర్యలు మాత్రం తీసుకోవడం లేదని విమర్శించారు. విజయవాడలో ఇళ్ల పట్టాలిస్తూ రూ.52 వేల కోట్ల ఆస్తి ఇచ్చినట్లు సిఎం మాట్లాడరని, ఇంటి నిర్మాణానికి రూ.52 వేల కోట్ల రుణ సదుపాయం కల్పించలేరా? అని ప్రశ్నించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ.. లోకేష్ మాటలకు, చేతలకు పొంతన లేదని, మోసపూరిత మాటలతో మాయ చేస్తున్నారని విమర్శించారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఈమని అప్పారావు, బి.వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)