- వైసిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల
- రెండోరోజు దాడులపై ఎస్ఇసికి ఫిర్యాదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిచోట్లా టిడిపి గూండాలు బరితెగిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. పోలీసులే దాడులు చేస్తున్నారని, దీనికి ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. కొన్ని చోట్ల అధికారులు నామినేషన్ల పత్రాలు తీసుకోవడం లేదని పుంగనూరు, రాయచోటి, పులివెందులలో అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. 15 లక్షల మృతుల ఓట్లు సహా మొత్తం 44 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నా ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం డమ్మీగా మారిందని తెలిపారు. పుంగనూరులో ఎంపి మిథున్రెడ్డిపై దాడి చేయడమే కాకుండా నాలుగు గంటలు వేచి ఉన్నా అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించలేదని తెలిపారు. పులివెందులలో పోలీసులు చెప్పిన సమయానికే వెళ్లినా ఎంపి అవినాష్రెడ్డి వెంట వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్నారన్నారు. తిరుపతిలో ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతిలో నామినేషన్ పత్రాలను చించేశారని విమర్శించారు. మధ్యాహ్నం మళ్లీ నామినేషన్ వేసేందుకు వెళ్లినా మూడు గంటల వరకు అడ్డుకుని వెనక్కి పంపించారని తెలిపారు.
వైసిపి నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరుపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందని, ఓటమి భయంతోనే టిడిపి కూటమి నేతలు అలజడి సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.








కామెంట్లు (0)