ప్రజాశక్తి - విజయనగరం, నిడదవోలు, కర్నూలు ప్రతినిధి : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు చోట్ల వార్డు కౌన్సిలర్ స్థానాలకు సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విజయనగరం నగర పాలక సంస్థలో 56వ డివిజన్ నుంచి సిపిఎం అభ్యర్థిగా పాలూరి రమణమ్మ ఆదివారం నామినేషన్ వేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మీడియాతో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 35వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సిపిఎం నుంచి మంగళగిరి పద్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె స్థానిక పాకీవీధి నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మద్దతు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో తొమ్మిదో వార్డులో సిపిఎం అభ్యర్థిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, 28వ వార్డు నుంచి పడాల హరిత నామినేషన్లు దాఖలు చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏడో వార్డుకు సిపిఎం అభ్యర్థిగా బంకురు ఆదిలక్ష్మి నామినేషన్ వేశారు.
నిడదవోలు మున్సిపల్ చైర్మన్ సిపిఎం అభ్యర్థి రాంబాబు నామినేషన్
నిడదవోలు పురపాలక సంఘ ఎన్నికల్లో చర్చిపేట 6వ వార్డుకు మున్సిపల్ కౌన్సిలర్గా సిపిఎం తరఫున జువ్వల రాంబాబు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు, కార్యకర్తలతో పట్టణ వీధుల్లో భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సిపిఎం తూర్పు గోదావరి జిల్లా టి.అరుణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు సిపిఎం మేయర్ అభ్యర్థిగా శ్యామల నామినేషన్...
కర్నూలు మేయర్ స్థానానికి సిపిఎం మేయర్ అభ్యర్థిగా బి.శ్యామల ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ నుంచి మేయర్ నామినేషన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బి.శ్యామల తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్కు సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులుగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలను గుర్తించి, తాగునీరు, మౌలిక వసతులు, ఇతర పౌర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థి శ్యామల మాట్లాడుతూ నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు.









కామెంట్లు (0)