- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఓటమి నైరాశ్యంతోనే వైసిపి దాడులకు పాల్పడుతోందని ఎంఎస్ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైసిపి శ్రేణులు రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక దాడులను, హింసా రాజకీయాలను ప్రజలు ఓటుతోనే తిప్పికొడతారని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు, భయాందోళనలకు ఎంతమాత్రం తావు లేదన్నారు. ఎన్నికల్లో గెలవలేమని వైసిపికి ముందుగానే స్పష్టంగా అర్థమైందని, అందుకే తీవ్ర నైరాశ్యంతో ఎన్నికల వేళ ఇలాంటి అరాచకాలకు, దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. వైసిపి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, దాడులకు తెగబడ్డా ప్రజలు భయపడే స్థితిలో లేరని, వారికి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరూ సంయమనం పాటించి, శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి యంత్రాంగం పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించి సహకరించాలని పిలుపునిచ్చారు.







కామెంట్లు (0)