వంటగదిలో కూరగాయలు, పండ్లు లేదా ఇతర పదార్థాలను కోయడానికి ‘చాకు’ పదునుగా ఉండాలి. అయితే చాలా గట్టిగా ఉండే పదార్థాలను కోయడం వల్ల బ్లేడ్ పదును తగ్గుతుంటుంది. చాకులను సరిగ్గా నిల్వ చేయకపోతే తేమ కారణంగా కూడా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే పదేపదే కడగడం, కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టకుండా ఉంచడం వల్ల కూడా బ్లేడ్ దెబ్బతినవచ్చు. ఇలా పదును తగ్గిన ప్రతిసారీ కొత్త చాకు కొనడం కంటే.. ఇంట్లోనే కొన్ని సులభమైన పద్ధతులతో చాకు పదును పెంచుకోవచ్చు.
ఇంట్లో ఉండే సిరామిక్ టీ మగ్‌ను ఉపయోగించి చాకు పదును చేయవచ్చు. సాధారణంగా మగ్ అడుగుభాగంలో పెయింట్ లేదా గ్లేజ్ లేని కొంత గరుకైన భాగం ఉంటుంది. చాకు బ్లేడ్‌ను ఆ గరుకు భాగంపై సుమారు 20 డిగ్రీల కోణంలో ఉంచి, ముందుకు వెనక్కు నెమ్మదిగా రుద్దాలి. బ్లేడ్‌కు రెండు వైపులా ఇలా చేయడం వల్ల పదును కొంత మెరుగుపడుతుంది. అయితే మగ్ లేదా చాకు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేయాలి. చాకు బ్లేడ్‌ను సరైన కోణంలో పదును చేసే రాయిపై ఉంచి, నెమ్మదిగా ముందుకు వెనక్కు రుద్ది కూడా పదును పెట్టవచ్చు.
చాకు పదును పెట్టే సమయంలో చేతులకు గ్లౌజులు లేదా ఇతర రక్షణ పరికరాలు ఉపయోగించడం, బ్లేడ్‌ను శరీరానికి దూరంగా ఉంచడం, పిల్లలకు అందకుండా పని చేయడం ముఖ్యం. బ్లేడ్ తీవ్రంగా దెబ్బతిన్నా లేదా తుప్పు పట్టినా వాడకపోవడమే మంచిది.







కామెంట్‌లు (0)