ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. దీనిని మట్టిలోనే కాకుండా నీటిలోనూ పెంచుకోవచ్చు. అయితే కొన్నిసార్లు తగినంత జాగ్రత్తలు తీసుకున్నా ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. కొత్త ఆకులు వచ్చినా తీగలు పెద్దగా పెరగవు. మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా, పచ్చగా పెరగాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలి.
L మనీ ప్లాంట్‌కు తగినంత వెలుతురు అవసరం. అయితే నేరుగా ఎక్కువసేపు సూర్యరశ్మి పడే ప్రదేశంలో ఉంచకూడదు. కిటికీ దగ్గర వెలుతురు బాగా అందే ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. మరీ తక్కువ వెలుతురు అందితే ఆకులు చిన్నవిగా మారడంతో పాటు తీగ మధ్య దూరం పెరిగి మొక్క పలుచగా కనిపించవచ్చు.
L మనీ ప్లాంట్‌కు ప్రతిరోజూ నీరు పోయడం మంచిది కాదు. అవసరానికి మించి నీరు అందితే మట్టి ఎప్పుడూ తడిగా ఉండి వేర్లకు నష్టం కలిగే అవకాశం ఉంది. కుండీలోని పై మట్టి పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. అదనపు నీరు బయటకు వెళ్లేందుకు కుండీ అడుగున డ్రైనేజీ రంధ్రాలు ఉండాలి. ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా మట్టి నుంచి బూజు వాసన రావడం అధికంగా నీరు పోస్తున్నారనే సంకేతం కావచ్చు.
L మొక్క పైభాగం ఆరోగ్యంగా కనిపిస్తున్నా కుండీలోని వేర్లకు స్థలం సరిపోకపోవచ్చు. వేర్లు కుండీ అడుగున ఉన్న రంధ్రాల నుంచి బయటకు వస్తుంటే లేదా కుండీ మొత్తం వేర్లతో నిండిపోతే కొంచెం పెద్ద కుండీలోకి మార్చాలి.
L మనీ ప్లాంట్ పైకి ప్రాకుతూ పెరిగే మొక్క. కాబట్టి తీగకు ఆధారం అందించి పైకి ఎక్కేలా చేస్తే మొక్క మరింత గుబురుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తీగలు పొడవుగా పెరిగి, ఆకులు మాత్రం తక్కువగా ఉంటే వాటిని కొంత మేర కత్తిరించవచ్చు. దీంతో కొత్త కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది. కత్తిరించిన తీగ ముక్కలను నీటిలో లేదా మట్టిలో నాటి కొత్త మొక్కలను పెంచుకోవచ్చు.
L మనీ ప్లాంట్‌కు వెచ్చగా, కొంత తేమ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఏసీ నుంచి నేరుగా వచ్చే చల్లని గాలి, హీటర్ దగ్గర లేదా నిరంతరం చల్లని గాలి వచ్చే ప్రదేశాల్లో మొక్కను ఉంచకపోవడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగడంతో పాటు ఇంటికి పచ్చదనాన్ని అందిస్తుంది.








కామెంట్‌లు (0)