ఇన్ సర్వీస్ డాక్టర్లకు కట్-ఆఫ్ తగ్గింపు సరైందే : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ చదువుకునే ఇన్-సర్వీస్ డాక్టర్లకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం సులభం కావాలని, వారు లాభాల కోసం కాకుండా ప్రజలకోసం పని చేస్తున్నారని సుప్రీం కోర్టు తెలిపింది. నేషనల్ ఎలిజిబిలిటీ - కమ్- ఎంట్రన్స్ టెస్ట్-సూపర్ స్పెషాలిటీ (ఎన్ఇఇటి-ఎస్ఎస్) సీట్లకు ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యుల కట్ - ఆఫ్ లేదా అర్హత పర్సెంటైల్‌ను తగ్గించాలని బుధవారం స్పష్టం చేసింది. ''వారు సేవ చేస్తూ చదువుకుంటున్నారు" అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. తమిళనాడులో ప్రభుత్వ సర్వీసు వైద్యులకు కేటాయించిన 152 ఖాళీ సూపర్ స్పెషాలిటీ సీట్లను ఆల్ ఇండియా కోటాకు బదిలీ చేయడాన్ని ఈ పిటిషన్ సవాలు చేసింది. "ఇంట్లో కూర్చుని చదివే వ్యక్తితో పోలిస్తే, ప్రభుత్వ వైద్యులు పని చేస్తూ చదువుకుంటున్నారు. వారు పబ్లిక్ హెల్త్ వ్యవస్థకు అత్యావశ్యకమైన భాగం. సీట్లను వారి నుండి తీసుకుంటే రాష్ట్రానికి ఎలా మేలు జరుగుతుంది?" అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి తమిళనాడులో ఇన్-సర్వీస్ అభ్యర్థులకు 219 సూపర్ స్పెషాలిటీ సీట్లు కేటాయించగా, 68 మంది మాత్రమే చేరారు. మిగిలిన 152 సీట్లను ఆల్ ఇండియా కోటాకు మళ్ళించారని పిటిషన్ పేర్కొంది. తదుపరి విచారణ జూలై 15న జరుగనుంది.







కామెంట్‌లు (0)