mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకస్టడీలో చంపేశారు!

2 గంటల క్రితం

ci nagarau
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:21 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• మృతదేహాన్ని మాయం చేశారు
• సాయికృష్ణ కేసు రిమాండ్‌ రిపోర్టులో సిట్‌

• స్టేషన్‌లో ఉండగా చనిపోయాక చూసినట్లు ఒక ఎస్‌ఐ వాంగ్మూలం

• అన్ని సాక్ష్యాలు పరిశీలించాకే కస్టోడియల్‌‌ డెత్‌‌గా నిర్ధారణ

‘పోలీస్‌ ‌స్టేషన్‌‌లో తీవ్రంగా హింసించడంతోనే సాయికృష్ణ మృతి చెందారు. ఆ తరువాత మృత దేహాన్ని మాయం చేశారు. అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాతే సాయికృష్ణది కస్టోడియల్‌ డెత్‌‌గా నిర్ధారించాం. నిందితుడైన సిఐ నాగరాజును అరెస్ట్‌ ‌చేశాం.’ అని రిమాండ్‌ ‌రిపోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ‌పేర్కొంది.

ప్రజాశక్తి- విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో అరెస్ట్‌ అయిన సిఐ నాగరాజును సిట్‌ అధికారులు విజయవాడ రెండవ అదనపు జ్యుడీషియల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌ముందు బుధవారం హాజరుపరిచారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను రిమాండ్‌ ‌రిపోర్టులో పేర్కొన్నారు. నాగరాజుపై 107/2026, భారతీయ న్యాయసంహిత (బిఎన్‌ఎస్‌) సెక్షన్లు 127 (4), 127 (6), 103 (1), 238 కింద నమోదైన కేసులపై జరిపిన విచారణలో అనేక కీలక విషయాలు వెలుగు చూసినట్లు సిట్‌ అధికారులు పేర్కొన్నారు. సాయికృష్ణ కస్టోడియల్‌ ‌డెత్‌‌కు గురైనట్లు తమ దర్యాప్తులో స్పష్టంగా తేలినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రిమాండ్‌ ‌రిపోర్టులోని వివరాల ప్రకారం సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అరెస్ట్‌ ‌చేశారు. అదే రోజు టాస్క్‌‌ఫోర్స్‌ ‌పోలీసులు నాగరాజు కు ఆయనను అప్పగించారు. ఆయనను మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టకుండా సిఐ నాగరాజు చట్టవిరుద్ధంగా తన కస్టడీలో ఉంచుకున్నారు. నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంటు ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు.

ఒక ఎస్‌ఐ చూశారు

గత నెల 6-8 తేదీల్లో సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో చూసినట్టు ఎస్‌ఐ చెప్పినట్లు రిమాండ్‌ ‌రిపోర్టులో సిట్‌ ‌పేర్కొంది. సాయికృష్ణ చనిపోయిన తరువాత మృతదేహాన్ని కూడా చూసినట్టు అదే ఎస్‌ఐ సిట్‌ అధికారులకు చెప్పారు. ఈ విషయాన్ని కూడా ధర్మాసనం ముందుకు సిట్‌ ‌తీసుకువచ్చింది. ‘ఒక ప్రముఖ ఇ-కామర్స్‌ ‌సంస్థ డెలివరీ బాయ్‌ ‌కూడా సాయికృష్ణను స్టేషన్‌‌లో చూసినట్లు చెప్పారు. తన కుమారుడి గురించి ఆరా తీయడానికి ఆయన తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సాయికృష్ణ కస్టడీకి సంబంధించి ఆమెకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. పోలీసు స్టేషన్లో తన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండటం సాయికృష్ణ తల్లి చూశారు. ఈ నేపథ్యంలో ఆమె తన సోదరి, న్యాయవాది కనకదుర్గ ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు తీవ్రంగా హింసించడంతో సాయికృష్ణ మరణించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు.’ అని సిట్‌ ‌రిపోర్ట్‌‌లో పేర్కొంది. ‘మే ఒకటి నుంచి జూన్‌ ఒకటి వరకు కృష్ణలంక పోలీసు స్టేషన్‌ ‌సిసి పుటేజీలను ఉద్దేశ పూర్వకంగా డిలీట్‌ చేశారు. లాకప్‌ డెత్‌ను దాచేందుకు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారు. శవాన్ని పూడ్చిపెట్టడమో, తగలబెట్టడమో చేసేందుకు ప్రయత్నించారు. అందుబాటులో ఉన్న అనేక సాక్ష్యాల ను పరిశీలించిన తరువాతే సాయి కృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, కస్టోడియల్‌ ‌డెత్‌ అన్న నిర్దార ణకు వచ్చాం.’ అని సిట్‌ ‌ధర్మాసనానికి తెలిసింది.

మృతదేహాన్ని ఏం చేశారో తెలియలేదు

‘మృతదేహం ఇంకా లభించలేదు. శవాన్ని ఏం చేశారో తెలియలేదు. ఇది చాలా సంక్లిష్టమైన కేసు. దర్యాప్తునకు మరింత సమయం అవసరం. సిఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదు. తప్పుడు సమాధానాలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారు’ అనిరిమాండ్‌ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు.

నాగరాజుకు 14 రోజుల రిమాండ్‌..

అరెస్ట అయిన సిఐ నాగరాజుకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. బుధవారం ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌‌క్లాస్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి జులై 8వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. దీంతో, సిఐను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. మూడు ఎస్కార్ట్‌ వాహనాలతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నాగరాజును తీసుకెళ్లారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్